
ప్రేమికుడి దాడిలో గాయపడిన అరుణ కన్నుమూత
రెండేళ్లుగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుందాం అని అడిగిన పాపానికి ఆ బంగారు తల్లిని నిలువునా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఐదు రోజుల పాటు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడిన ఆ అమ్మాయి.. ఇక ఈ పాపిష్టి లోకంలో తానుండలేనంటూ వెళ్లిపోయింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూసింది.
బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఆమెకు దర్వేశిపురానికి చెందిన సైదులుతో పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోమంటే ఏదో కారణం చెబుతూ వాయిదా వేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఫైనాన్స్ కార్యాలయంలోకి అరుణ వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీసింది. దీంతో అతను కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని ఆమె బావకు ఫోన్ చేసి తెలిపాడు. తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినా, మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదు రోజుల పాటు నరకం అనుభవించిన అరుణ.. ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది.