
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రేవతి మరణించింది. కాకినాడలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న రేవతి, సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలింది. మూడు రోజుల్లో పెళ్లి ఉందనగా ఓ యువతిపై ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించిన నవీన్ అనే యువకుడు ఈనెల 18వ తేదీన ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. పిఠాపురానికి చెందిన రేవతి పదో తరగతి చదువుతోంది. గతంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ నవీన్ అనే పెయింటర్ వెంటపడేవాడు. ఆమె అతడిని తిరస్కరించింది. ఆ విషయం ఇంట్లో కూడా చెప్పడంతో ఇంట్లో పెద్దలు అతడిని తీవ్రంగా మందలించారు.
కొంతకాలంగా దూరంగానే ఉంటున్న అతడు, బుధవారం ఉన్నట్టుండి రెచ్చిపోయాడు. ఇంట్లో అందరూ పెళ్లి పనుల మీద బయటకు వెళ్లిన సమయం చూసి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చాడు. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. కాసేపటికే ఇంట్లోంచి అమ్మాయి అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికి ఆమె మంటల్లో కాలిపోతోంది. వెంటనే నీళ్లు పోసి, దుప్పట్లు కప్పి, ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ 60 శాతం వరకు ఆమెకు కాలిన గాయాలు కావడంతో వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.