పట్టీలు కొనివ్వలేదని.. ప్రాణాలు తీసుకుంది
కేసముద్రం: గణతంత్ర వేడుకలకు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో భరతమాత వేషధారణతో కనిపించాలనుకున్న ఆ విద్యార్థిని కోరిక విషాదానికి దారితీసింది. వేషధారణకు అవసరమైన కొత్త దుస్తులు, పట్టీలు తండ్రి తీసుకరాకపోవడంతో మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ శివారు పిల్లగుండ్ల తండాలో శనివారం జరిగింది.
ఎస్సై అబ్దుల్ రహమాన్ తెలిపిన ప్రకారం...తండాకు చెందిన గుగులోతు లచ్చు, హమాలీ దంపతులకు కుమార్తెలు మనీషా, అనూష, శిరీష ఉన్నారు. మనీషా పదో తరగతి, అనూష (12)స్థానిక యూపీఎస్‌లో ఏడో తరగతి చదువుతున్నారు. ఎంతో చురుగ్గా ఉండడే అనూష పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో కబడ్డీ, రన్నింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. ఆ సంతోషంలో ఉన్న అనూష కొత్త దుస్తులు, పట్టీలతో వెళ్లి రిపబ్లిక్ డే రోజు భరతమాత వేషం ధరించాలని ఆశపడింది.
ఈ క్రమంలోనే ఆమె శుక్రవారం కేసముద్రం మార్కెట్‌కు తమ చేలో పండిన పత్తి అమ్మడానికి వెళ్తున్న తండ్రితో ‘నాన్నా నాకు పట్టీలు, లంగా ఓణీ తీసుకురా’ అని కోరింది. అరుుతే పత్తి అమ్మగా వచ్చిన డబ్బులతో చేసిన అప్పు తీరేటట్లు లేదన్న బాధతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తండ్రితో పట్టీలు, డ్రెస్సు కావాలంటూ అనూష మారం చేసింది. శనివారం ఉదయం కూడా మళ్లీ అడిగింది. దీంతో తల్లి ఆమెను సంతోషపెట్టాలనుకుంది.
మార్కెట్‌కు వెళ్లి గాజులు, చెప్పులు కొనుక్కొచ్చి కూతురుకు ఇచ్చింది. అనంతరం అప్పు చెల్లించేందుకు తండ్రి, చేను వద్దకు తల్లి వెళ్లిపోయారు. అయితే మనోవేదనతో ఉన్న అనూష తల్లి తెచ్చిన గాజులు తొడుక్కుని, చెప్పులు వేసుకుని ఇంట్లో దూలానికి ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారు హతాశులై కుప్పకూలారు. గుండెలవిసేలా కూతురు కోసం రోదించారు.