విజయవాడ : విజయవాడలో అంత్యక్రియలకు సిద్దం చేస్తుండగా బాలిక తిరిగి బతికిందనే వార్త సంచలనం సృష్టించింది. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వివరణ ఇవ్వాల్సివచ్చింది.
అసలు ఏం జరిగిందంటే ?
రాజరాజేశ్వరి పేటకి చెందిన సాయి దుర్గ అనే బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి సాయి దుర్గ మరణించినట్లు ధృవీకరించారు. సాయిదుర్గ చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కన్నీరుమున్నీరైన బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంతలోనే బాలిక కదిలిందంటూ చెప్పడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. బతికున్న బాలికను చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ ఆసుపత్రి సిబ్బందిపై బాలిక బంధువులు మండిపడ్డారు.
అయితే శుక్రవారం సాయంత్రమే సాయి దుర్గ మృతి చెందిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ చక్రధర్ సాయి తెలిపారు. అయినా డాక్టర్లతో మరోసారి ధృవీకరించామన్నారు. కుటుంబ సభ్యుల అపోహల కారణంగానే ఈ గందరగోళం జరిగిందన్నారు. ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్ చేసిన నిర్వాకంపై విచారణ చేపడతామన్నారు. ప్రయివేటు ఆర్ ఎంపీ వైద్యురాలు బాలిక బతికుందని చెప్పడంతో అసలు గందరగోళం తలెత్తిందని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలు ప్రాణాలు కాపాడానికే ఉన్నాయి. తీయడానికి కాదని చక్రధర్ సాయి అన్నారు. బాలిక చనిపోయింది కాబట్టే నాలుగు ఆసుపత్రిల చుట్టూ తిప్పినా వైద్యం చేయడానికి ఎవరు ముందుకు రాలేదని తెలిపారు. ఈ ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ డీఎమ్ఈని విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment