‘గీతాంజలి’కి సీక్వెల్ తీస్తా
భీమవరం: హర్రర్ కామెడీ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని.. వీటికి చక్కటి ఆదరణ ఉందని గీతాంజలి చిత్ర దర్శకుడు రాజ్‌కిరణ్ అన్నారు. స్థానిక కిషోర్ థియేటర్‌లో గీతాంజలి చిత్రాన్ని శుక్రవారం రాత్రి ఆయన తిలకించారు. విరామ సమయంలో పలువురిని సినిమాపై అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చక్కటి కథతో గీతాంజలి సినిమాను తెరకెక్కించారని ఆయన్ను ప్రశంసించారు. అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు. థియేటర్ యాజమాన్యం ఆయన్ను సత్కరించింది.
అనంతరం విలేకరులతో రాజ్‌కిరణ్ మాట్లాడుతూ కైకలూరులో పుట్టిన తాను భీమవరం కేజీఆర్‌ఎల్ కాలేజీలో చదువుకున్నానన్నారు. ఇక్కడ ఎంఎస్ నారాయణ పరిచయంతో సినిమాలపై మక్కువ పెంచుకున్నానని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని తెలిపారు. రెండు సినిమాల తర్వాత గీతాంజలికి సీక్వెల్ తీస్తానని చెప్పారు. గీతాంజలి చిత్రానికి రూ.4 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికి రూ.13 కోట్లు వసూలు చేసిందన్నారు. కథ బాగుంటే చిన్న సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి గీతాంజలి విజయమే నిదర్శనమన్నారు. ఐ.రాంబాబు, వాసు ఆయన వెంట ఉన్నారు.