భోగాపురం: భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెం.63ని వ్యతిరేకిస్తున్నాం అని సిపిఎం జిల్లా కన్వీనరు టి. సూర్యనారాయణ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎయిర్ పోర్టు నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుచేసి మొత్తం అధికారులను నియమించి ప్యూజ్‌బులిటీ, ఎన్విరాన్‌మెంట్,చట్టపరమైన సమస్యలు పరిష్కరించి పనులు ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసిందని దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అలాగే ప్రభుత్వం, కలెక్టరు చేస్తున్న ప్రకటనలు రైతులను, గ్రామస్తులను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయన్నారు. ఎయిర్‌పోర్టుకు ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేందుకు ప్రజలు, రైతులు సిద్ధంగా లేరన్న విషయం తెలుసుకున్నామన్నారు. కావున వారి అభీష్టానికి మద్దతుగా సీపీఎం నిలుస్తుందని, ప్రజల తరఫున ఉద్యమించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బి. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.