
చంపడమే లక్ష్యమా?
తాడిపత్రి రూరల్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కకు పెట్టి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు.
తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో శనివారం టీడీపీ నేతల దాడిలో గాయపడిన నారాయణ, సుబ్బమ్మ, వెంకట్రాముడు, పుల్లారెడ్డి, కర్రెప్ప, వినోద్‌కుమార్‌ల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెలే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, నియోజకవర్గం సమన్వయకర్తలు వీఆర్ రామిరెడ్డి, రమేష్‌రెడ్డిలతో కలిసి ఆయన పరామర్శించారు.
దాడికి గురైన వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ నాయకులు వీరాపురం సుంకిరెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, వంశీవర్ధన్‌రెడ్డి, హారీష్‌రెడ్డిలను కలసి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న తాము ఇటీవల ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలోకి రావడంతో వారు కక్ష్యకట్టారన్నారు. వారి ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు తమను హత్య చేసేందుకు ఇళ్లపైకి వచ్చారని వారు వివరించారు.
అడ్డు వచ్చిన ఆరు మందిపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో వారు ఇప్పుడు కోలుకోలేని విధంగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. పార్టీ అధినేత తమను పంపిచారని మీరు భయపడాల్సిన పనిలేదని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సుంకిరెడ్డి కుంటుంబ సభ్యులకు కరుణాకర్‌రెడ్డి, వై.ఎస్.వివేకానందరెడ్డి భరోసా ఇచ్చారు. దాడికి గురైన వారి తరుఫున న్యాయ పోరాటం చేస్తామని ధైర్యం చెప్పారు. సంఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీ మారారని కక్షగట్టి దాడి చేయడం సబబు కాదన్నారు. ఇలాంటి దాడులకు వైఎస్‌ఆర్‌సీపీ బెదరదని చెప్పారు. మడకశిర నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ.. పెద్ద మాదిగగా అండగా ఉంటానని చెప్పిన చంద్రబాబు ఇపుడేం చెబుతారని ప్రశ్నించారు. ఈ దాడిపై కేంద్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పర్యటించిన పార్టీ నేతల్లో వై.వెంకట్రామిరెడ్డి, సాంబశివారెడ్డి, తిప్పేస్వామి, సోమశేఖర్‌రెడ్డి, నవీన్‌నిశ్చల్, ఎర్రిస్వామిరెడ్డి, చావ్వా రాజశేఖర్‌రెడ్డి, బోరంపల్లి అంజనేయులు, మీసాల రంగన్న, కోర్రపాడు హేసేన్‌పీరా, పామిడి వీరాంజినేయులు, అలమూరు శ్రీనివాసులరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రవీంద్రారెడ్డి, పాశం రంగస్వామి యాదవ్, కంచం రామ్మోహన్‌రెడ్డి, వి.ఆర్.వెంకటేశ్వరరెడ్డి, వి.ఆర్.విఘ్నేశ్వర్‌రెడ్డి, అలూరు రామచంద్రారెడ్డి, దీలిప్‌రెడ్డి, మున్నా, రంగనాథ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి హరినాథ రెడ్డి, తేజ, బోంబాయి రమేష్‌నాయుడు, రఘునాథ్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కందిగోపుల మురళి ప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సంపత్, శ్రీకాంత్‌రెడ్డి, రామమునిరెడ్డి ఉన్నారు.