కాకినాడసిటీ : గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ శాఖల వారీ చేపట్టిన పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన నిర్వహించి సకాలంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులను ఆదే శించారు. ఈ అంశంపై మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పనుల ప్రగతిని సమీక్షించారు. గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని స్నాన ఘట్టాలవారీగా పనులను సమీక్షిస్తూ ప్రతి స్నానఘట్టం వద్ద తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, దుస్తులు మార్చుకునే సౌకర్యం, విద్యుత్ దీపాలు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య, ఆరోగ్య తదితర శాఖల అధికారులను ఆదేశించారు.
ఇందుకు సంబంధించి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉచితంగా ఆహారం, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చే ఎన్‌జీఓలు, వివిధ సంస్థల వివరాలు సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పుష్కరాలకు రాజమండ్రి, ఇతర ప్రాంతాలకు వచ్చే భక్తులు వివిధ దేవాలయాలను, ఇతర పర్యాటక ప్రాంతాలకు సందర్శించేందుకు వీలుగా అవసరమైన వాహనాలను నిర్ణీత అద్దె ధరలకు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రవాణాశాఖ అధికారులను
ఆయన ఆదేశించారు.
నిర్దేశిత ధరలకు అందుబాటులో ఉంచాలి
పుష్కరాలకు వచ్చే భక్తులకు పాలు, పెరుగు, ఇతర పానీయాలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర సరుకులు నిర్దేశిత ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను జేసీ ఆదేశించారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఆహార పదార్ధాలు, పాలు అందుబాటులో ఉంచే చర్యలు తీసుకోవాలని ఆయా డెయిరీల ప్రతినిధులను జేసీ కోరారు.
26న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాక
పుష్కరాల ఏర్పాట్లు, పనుల పరిశీలనకు ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాజమండ్రి రానున్నారని జేసీ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు శాఖలవారీ జరుగుతున్న పనుల ప్రగతి నివేదికలతో సమీక్షకు హాజరుకావాలని ఆదేశించారు. సమావేశంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయరామరాజు, ఆర్డీఓలు బీఆర్ అంబేద్కర్, కె.సుబ్బారావు, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల అధికారులు, వివిధ హోల్‌సేల్ డీలర్లు, హోటల్ యజమానుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
పుష్కర పనులు వేగవంతంగా పూర్తిచేయాలి
Published Wed, May 20 2015 1:46 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement
Advertisement