పోయే వారికిపొగ!
=జంపింగ్ నేతల నియోజక వర్గాల్లో కొత్త నాయకత్వం
=జాబితా సిద్ధం చేసిన డీసీసీ,విశాఖ నగర కాంగ్రెస్
=11, 12ల్లో పరిశీలకుల రాక
కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమనుకునే వారికి తామే పొగబెట్టి పంపే దిశగా జిల్లా, నగర కాంగ్రెస్ విభాగాలు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే అనుమానితుల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులను తెర మీదకు తెచ్చి కొన్ని రోజుల్లో వారికి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అనకాపల్లి, భీమిలి, పెందుర్తి, గాజువాక, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా మరో నలుగురు ఎమ్మెలు పార్టీకి టాటా చెప్పడం ఖాయమని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నారు. న ర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాలపాపను అనుమానిత జాబితాలో ఉంచారు. ఈ నెల 23 తర్వాత వీరంతా పార్టీని వీడితే ఆయా నియోజకవర్గాల్లో ఒక్కసారిగా నాయకుడు లేకుండా పోతారనే ఆలోచనతో ఎమ్మెల్యేలు ఉండగానే వారి నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌ల నియామక ప్రక్రియ మొదలెట్టారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచన మేరకు డీసీసీ అధ్యక్షుడు ధర్మశ్రీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ తరపున నిలిపే అభ్యర్థులను బట్టి సామాజిక, ఆర్థిక బలసమీకరణలను అంచనా వేసి తమ అభ్యర్థిని తెరమీదకు తెచ్చే పనిలో పడ్డారు. ఏఐసీసీ ఆదేశం మేరకు ఈ నెల 11, 12వ తేదీల్లో కర్ణాటక ఎమ్మెల్యే యశ్వంత్రీగౌడ్ పరిశీలకునిగా జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు సంబంధించి చోడవరం, పాడేరులో రెండు సమావేశాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు యోచిస్తున్నారు. విశాఖ సిటీ సమావేశం ఎక్కడ నిర్వహించేదీ ఇంకా ఖరారు కాలేదు.
ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను సూచిస్తే పరిశీలకులు వాటిని ఢిల్లీకి తీసుకుని వెళ్లి పీసీసీ ద్వారా మరింత సమాచారం సేకరించి స్థానిక పరిస్థితులను బట్టి అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ ముఖ్య నాయకుడొకరు ‘సాక్షి’కి తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నియోజకవర్గాల వారీగా నేతలు ఖరారు చేసిన అభ్యర్థుల జాబితా ఇలా వుంది.
అనకాపల్లి : కె. జగన్, రఘుబాబు, కాపు సా మాజికవర్గం నుంచి ఎం. రమణ రావు, లేదా ఆయన సతీమణి ధనమ్మ, సన్యాసినాయుడు
యలమంచిలి : గంధం నందగోపాల్, బి.వెంకటేశ్వరరావు, గవర నుంచి పోటీకి దింపాలనుకుంటే ఎన్‌ఆర్‌ఐ ఒకరి పేరు పరిశీలనలో ఉంది.
మాడుగుల : ధర్మశ్రీ. ఆయన అనకాపల్లి ఎంపీకి పోటీ చేసేట్లయితే రామ్మూర్తినాయుడు, తులపట్ల భాస్కర్.
చోడవరం : ధర్మశ్రీ లేదా గొర్లె సూరిబాబు, స్థానికుడైన ఒక డాక్టర్.
పెందుర్తి : శరగడం చిన అప్పలనాయుడు, బిజి నాయుడు, దొర్ల రామునాయుడు, తాలపు మీన, తోట విజయలక్ష్మి
భీమిలి : మాజీ శాసనసభ్యుడు కర్రి సీతారాం
నర్సీపట్నం : ముత్యాలపాప. ఈమె పార్టీ మారితే ప్రత్యామ్నాయంగా తూర్పుకాపు, వెలమ, క్షత్రియ సామాజిక వర్గాల నుంచి పేర్లు పరిశీలనకు తీసుకోవాలని నిర్ణయించారు.