విద్యార్థుల అభివృద్ధికి బంగారు బాటలు
నెల్లూరు(రెవెన్యూ): గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల అభివృద్ధికి బంగారు బాటలు వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన మార్గదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. చైర్మన్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు రాబోవు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడే విధంగా రూ.6.50 లక్షల వ్యయంతో మార్గదర్శిని రూపొందించామన్నారు.
జిల్లా పరిషత్, మున్సిపాలిటీ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిషు మీడియం చదువుతున్న 22,700 మంది విద్యార్థులకు మార్గదర్శిని అందిస్తామన్నా రు. విద్యార్థులందరూ మార్గదర్శినిని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధిం చాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షల్లో మొదటి మూడు ర్యాంక్‌ల్లో నిలిచిన విద్యార్థులకు తన సొంత నిధులు రూ. 15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజే స్తామన్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వికలాంగ విద్యార్థులకు రూ.15 వేలు, రూ.10 వేలు అందజేస్తామని ప్రకటించారు.
ప్రతి నియోజకవర్గంలో అత్యధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, వాత్సల్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన ఇద్దరిని కార్పొరేట్ కళశాలల్లో ఇంటర్ పూర్తి చేసేంత వరకు తన సొంత నిధులు కేటాయిస్తాని ప్రకటించారు.
10వ తరగతి విద్యార్థుల కోసం 11 మంది సొంత నిధులు వెచ్చించి విద్యా వలంటరీలను నియమించామన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలన్నారు. అత్యధిక ర్యాంకులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతు లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు మార్గదర్శిని పుస్తకాలు అందజేశారు. మార్గదర్శిని పుస్తకం రూపొందించిన ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు అందజేశారు.