కేతేపల్లి, న్యూస్‌లైన్
మూసీ ప్రాజెక్టు మరమ్మతులు చేసేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందులో భాగంగానే రూ.13 కోట్లు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో మూసీ ఆయక ట్ట్లు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా జిల్లాలోని నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లోని 44 గ్రామాలలో 35వేల ఎకారాలపైగానే సాగు నీరందుతోంది. 1963లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి నేటివరకు మూసీ ప్రాజెక్టు, గేట్లు, ప్రధాన కాల్వలకు ఒక్కసారి కూడా మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రధాన కాల్వలతో పాటు పంట పొలాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాల్వల్లో కంప చెట్లు, పేరుకుపోయిన పూడిక, మరమ్మతులు లేక డిస్ట్రిబ్యూటరీల తూముల వద్ద లైనింగ్‌లు దెబ్బతిన్నాయి. మరమ్మతులు చేపట్టకుండానే ప్రతి ఏటా నీరు విడుదల చేస్తుండడంతో మెదటి జోన్ ఆయకట్టుకు కూడా నీరుసరిగా అందడం లేదు.
మూసీ ప్రాజెక్టుకు మొత్తం 30 గేట్లు ఉన్నాయి. వీటిలో 10గేట్లు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో వాటిని శాశ్వతంగా మూసి వేశారు. 8 రెగ్యులేటర్ గేట్లకు రబ్బర్ సీల్ ధ్వంసం కావడంతో భారీగా లీకేజీలు అవుతున్నాయి. ప్రతి ఏటా అధికారులు గోనె సంచులు,నార కట్టలు వేసి నీటి లీకేజీలను కొంతమేర అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గోనె సంచులు, నారకట్టలు చీకిపోవండంతో నీటి లీకేజీలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేయాలని గత ఏడాది నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎట్టకేలకు మూసీ ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.13 కోట్లు మంజూరు చేస్తూ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక.. మూసీకి లీకేజీల సమస్య తీరుతుందని రైతులు భావిస్తున్నారు.
మూసీకి మహర్దశ
Published Fri, Jan 3 2014 2:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement
Advertisement