సాక్షి, అమరావతి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రామ్ ప్రకాశ్ సిసోడియాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. 1993 బ్యాచ్‌కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ ద్వివేదికి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పువు
అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతముగా నిర్వహిస్తామని కొత్త ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేది నియమితులైన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అవకతవకలు ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని తేల్చిచెప్పారు. ఓటు విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటర్లు ఎప్పటికప్పుడు ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment