
ప్రభుత్వఉద్యోగులకు gov.in మెయిల్స్
దేశంలో అమలవుతున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా కాగిత రహిత పాలనకు రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ డేటా రక్షణ నిమిత్తం చర్యలు
నగరంపాలెం(గుంటూరు) : దేశంలో అమలవుతున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా కాగిత రహిత పాలనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌లను దశలవారీగా అమలుచేస్తోంది. ఇందులో భాగంగా ఫైళ్లను కంప్యూటరీకరించి ఆమోదం కోసం వివిధ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లోనే పంపుతారు. ఆన్‌లైన్‌లో పంపటానికి gmail,yahoo,rediff తదితర విదేశీ సంస్థల మెయిల్స్‌ను వాడుతారు. దీనిలోకి అప్‌లోడ్ చేసిన డేటా మొత్తం విదేశాలలో ఉన్న సర్వర్లలో నిల్వ ఉంటుంది.
సాంకేతిక కారణాల వలన విదేశాలలో సర్వర్లు పనిచేయకపోయినా, లేదా రక్షణ పరమైన ఇబ్బందుల కారణంగా డేటా మార్పులు చేర్పులు జరిగినా, డిలీట్ అయినా, సంఘవిద్రోహశక్తులకు తెలిసినా ప్రభుత్వ వ్యవస్ధ మొత్తం స్తంభించే అవకాశం ఉంది. అందువల్ల దేశంలోని అత్యున్నత సర్వీసులు, రక్షణ రంగాల అధికారులకు మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్వదేశీ సర్వర్లతో నడిచే మెయిల్ తరహా సర్వీసులను దేశంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వనున్నారు. దీని కోసం ఝ్చజీ.జౌఠి.జీ అనే వెబ్‌సైట్ ను రూపొందించారు.
ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ ఇన్‌ఫెర్మాటిక్ సెంటర్ ద్వారా మెయిల్స్ క్రియేట్ చేసే బాధ్యతను ఆరునెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగి కార్యాలయ అవసరాలకు సంబంధించిన డేటాను రక్షణ నిమిత్తం ఈ మెయిల్స్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జిల్లాలోని చాలా మంది ఉద్యోగులు అవగాహన లేక మెయిల్ క్రియేషన్‌పై శ్రద్ధ చూపడం లేదు. ఈ-సర్వీసులు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి ఉచితంగా అందించటంతో పాటు ఫ్రీ ఎస్‌ఎంఎస్ సౌకర్యం ఉంటుంది.
ఎన్‌ఐసీ ద్వారా మెయిల్స్ రూపకల్పన
జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటరు ద్వారా gov.in మెయిల్ క్రియెట్ చేస్తామని ఇన్‌ఫర్మేటిక్ జిల్లా అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది వారి అధికారి ద్వారా అప్లికేషన్లు సమర్పిస్తే మెయిల్స్ క్రియేట్ చేస్తామన్నారు. mail.gov.in అనే వెబ్ సైట్‌లో అప్లికేషను డౌన్‌లోడ్ చేసి ఉద్యోగి వారీగా వివరాలు నమోదు చేసి ఎన్‌ఐసీ కార్యాలయానికి అందించాలన్నారు.
ఉద్యోగి వివరాలు ప్రకారం మెయిల్స్ క్రియేట్ చేసిన వెంటనే వారి ఇచ్చిన ఫోన్‌కు పాస్‌వర్డు ఎస్‌ఎంఎస్ వస్తుందన్నారు. కార్యాలయంలోని ఉన్నత ఉద్యోగి నుంచి అన్ని కేడరు ఉద్యోగులకు క్రియెట్ చేసే ఈ-మెయిల్ ఉద్యోగి పదవీ విరమణ తరువాత కూడా వినియోగించుకునే వీలు ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ-ఆఫీస్ సిద్ధంలో భాగంగా కార్యాలయం ఉద్యోగులకు, జిల్లాపరిషత్ ఉద్యోగులకు, పోలీస్ ఉన్నతాధికారులకు ఇప్పటికే gov.in క్రియేట్ చేశామని తెలిపారు.