
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతనాల చెల్లింపు ప్రక్రియలో కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ‘డిజిటల్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘ఈ–కుబేర్’విధానాన్నే ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల చెల్లింపులను అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కొత్త పద్ధతిలోనే ఆగస్టు 1న వేతనాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే తుది దశకు చేరింది. స్వల్ప సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వారంలోపే అన్ని సమస్యలను పరిష్కరించి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఆర్థిక, ఖజానా శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3.2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.56 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందరికీ కలిపి ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.6 వేల కోట్లను చెల్లిస్తోంది. భారీ మొత్తం కావడంతో చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ–కుబేర్ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులకు ప్రతి నెలా కచ్చితమైన సమయానికి వేతనాలను చెల్లిస్తారు.
పెన్షనర్లకు ఇప్పటికే అమలు: ఈ–కుబేర్ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలిదశలో ఎనిమిది రాష్ట్రాల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే 2.56 లక్షల పెన్షనర్లకు ప్రస్తుతం ఈ–కుబేర్ విధానాన్ని ప్రయోగాత్మక విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉద్యోగులకు సైతం దీన్ని అమలు చేసేందుకు నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటికీ సమస్యలు ఉంటే కొత్త విధానాన్ని సెప్టెంబర్‌కు వాయిదా వేసే అవకాశం ఉందని చెప్పారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల వేతనాల బిల్లులను ట్రెజరీ అధికారులు ‘ఈ–కుబేర్’సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఉద్యోగి బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఆధార్ కార్డు నంబర్‌ను అప్‌లోడ్ చేస్తారు. ఈ వివరాలు ఆర్‌బీఐకి చేరుతాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) పద్ధతిలో ఆర్‌బీఐ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను జమ చేస్తుంది.
ప్రస్తుతం ఇలా..
ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపునకు సంబంధించి ప్రస్తుత విధానంలో ఎక్కువ ప్రక్రియ ఉంటోంది. ఆయా కార్యాలయాల్లోని డ్రాయింగ్ హోదా కలిగిన ఉద్యోగి.. మిగిలిన ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించిన బిల్లులను తయారు చేస్తున్నారు. వీటిని ఆయా జిల్లాల పరి ధిలోని ట్రెజరీలకు, అక్కడి నుంచి బ్యాంకులకు పంపిస్తున్నారు. బిల్లులకు అనుగుణంగా బ్యాం కుల్లో ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. అనంతరం ఉద్యోగుల వారీగా బ్యాంకులు ఖాతాల్లో వేతనాలను జమ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటోంది. సెలవులు వస్తే అన్ని ప్రక్రియల్లో జాప్యం జరిగి వేతనాల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఈ–కుబేర్‌తో ఆలస్యానికి అవకాశమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment