నిరుద్యోగికి నిరాశే | government does not provide job notifications for unemployed till now | Sakshi
Sakshi News home page

నిరుద్యోగికి నిరాశే

Published Sat, Dec 2 2017 4:33 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM

government does not provide job notifications for unemployed till now - Sakshi

సాక్షి, అమరావతి: పట్టా చేతికొచ్చినా ప్రయోజనంలేదు. ఇంట్లో వాళ్లకి భారం కాకుండా ఏమి చేయాలో తెలియదు. ఉద్యోగం కోసం ఎటు పోవాలో అర్థంకాదు. వయసు పెరిగిపోతోందని బాధ ఓ వైపు. ఉద్యోగం వస్తుందో రాదో అనే ఆవేదన మరో వైపు. ఈ పరిస్థితులతో రాష్ట్రంలో నిరుద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వ నేతల హామీలు నీటి మూటలుగా మిగిలిపోవడంతో రాష్ట్రంలో ఏటేటా లక్షల సంఖ్యలో పెరిగిపోతున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. బాబొస్తే జాబొస్తుందని చెప్పిన పాలకులు ఇంతవరకూ ఖాళీగా ఉన్న పోస్టులనే భర్తీ చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు మాటలు నమ్మిన వారు ఇప్పటి వరకూ తమకు రావాల్సిన రూ. 82 వేల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగిపోయింది. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో కమలనాథన్‌ కమిటీకి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 2014 తరువాత రిటైరయిన వారితో కలుపుకుంటే ఆ పోస్టుల సంఖ్య ఇపుడు 1.80 లక్షలకు పైగా చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీచేయడం లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తోంది. వేలాది మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పొట్టగొట్టింది. మరోపక్క ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు వయోపరిమితి దాటిపోయింది. మరోపక్క ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో లక్షలాది మంది వేలాది రూపాయల ఫీజులు చెల్లించి కోచింగ్‌ తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు పదివేల పోస్టులను కూడా భర్తీచేయలేదు. 1.80 లక్షల ఖాళీల్లోనూ కేవలం 20 వేల ఖాళీలు మాత్రమే నింపుతామని, తక్కిన వాటిలో కొన్నింటిని ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ 20 వేలలోనూ కేవలం 10 వేలకు మాత్రమే ఏడాది క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు వాటి నియామకాలు పూర్తికాలేదు. నాలుగు, ఐదేళ్ల నుంచి చూస్తే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 35 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. గతంలో ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు రాని వారిని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీరంతా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.  

ఉద్యోగం రాదని, ఉన్నత విద్య ఎందుకని 
రాష్ట్రంలో ఏటా 10వ తరగతి 5 లక్షల మంది, ఇంటర్మీడియెట్‌ 4 లక్షల మంది, డిగ్రీ 1.80 లక్షల మంది, సాంకేతిక, వృత్తి విద్యాకోర్సుల్లో 1.50 లక్షల మంది, పీజీ కోర్సుల్లో లక్ష మందికి పైగా పూర్తి చేస్తున్నారు. వీరిలో లక్షలాది మంది ఉన్నత విద్యకు వెళ్లడంలేదు. ఉద్యోగం రాదనే ఉద్దేశంతో వారు మధ్యలోనే చదువు విరమించుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించే ప్రత్యేక హోదా హామీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడటంతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, అటు ప్రైవేట్‌ ఉద్యోగాలు రాక ఉద్యోగం అనే మాటనే నిరుద్యోగులు మర్చిపోతున్నారు.  

రూ. 82 వేలు బకాయి ఎప్పుడిస్తారో? 
ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు తమ ప్రచారంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులందరికీ ప్రతినెల రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 41 నెలలు అయినా ప్రభుత్వం నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోలేదు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ నిరుద్యోగులకు బాసటగా పోరాటం చేసినా ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాత్రం నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగభృతి కల్పించే ముసాయిదా ప్రతిపాదనను వెంటనే తయారు చేయాలని శుక్రవారం మంత్రివర్గం ఆదేశించినట్లు తెలిసింది. అయితే 41 నెలలుగా ప్రభుత్వం భృతి ఇవ్వాల్సి ఉందని, ఒక్కొక్కరికీ రూ. 82 వేలు చొప్పున బకాయి పడిందని నిరుద్యోగులు చెబుతున్నారు. అయితే భృతిపై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలను ప్రభుత్వ వమ్ము చేయనుంది. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు చూస్తే అది స్పష్టమవుతుంది. రుణమాఫీ హామీ మాదిరిగానే నిరుద్యోగ భృతి హామీని కూడా మమ అనిపించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  

నిరుద్యోగ భృతికి సవాలక్ష షరతులు 
నిరుద్యోగ భృతికి మంత్రుల కమిటీ పలు షరతులు పెట్టింది. రూ. 2 వేలు భృతి అని హామీ ఇచ్చి దాన్ని రూ. 1,500కు కుదిస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్యను కూడా భారీగా తగ్గించేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 లక్షలకు పైగా నిరుద్యోగులుండగా ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను 7 నుంచి 8 లక్షలకు తగ్గించాలని చూస్తోంది. 18 నుంచి 35 సంవత్సరాల వారు మాత్రమే భృతికి అర్హులను చేస్తోంది. ఇంటర్మీడియెట్‌ను కనీస అర్హతగా పరిగణిస్తున్నారు. ఇక భృతికి నైపుణ్య శిక్షణతో ముడిపెట్టారు. నిరుద్యోగ భృతి లేదా నైపుణ్యశిక్షణలో ఏదో ఒకదాన్ని అర్హులైన నిరుద్యోగులు ఎంచుకోవలసి ఉంటుంది. ప్రతి నిరుద్యోగికీ భృతి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు మాత్రం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించారు. నాలుగు చక్రాల వాహనం ఉంటే ఇవ్వరాదని నిబంధనల్లో చేర్చారు. తెల్లకార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకే దీన్ని పరిమితం చేయనున్నారు. అలాగే వ్యవసాయ భూమి మెట్ట అయిదెకరాలు, పల్లం 2.5 ఎకరాల లోపు ఉన్న వారికే భృతి వర్తిస్తుంది. గతంలో స్వయం ఉపాధి కింద రుణాలు పొందినా, శిక్షణ తీసుకున్నా వారినీ దీని నుంచి మినహాయించనున్నారు. ఉన్నత చదువులు చదివే వారిని భృతి నుంచి మినహాయిస్తారు. ఇక  నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగిస్తారు. పథకం ప్రారంభించడానికి ముందు... ఇప్పటి వరకు ఎక్కడా నిరుద్యోగులుగా పేరు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం ఇస్తారు.  

బేషరతుగా భృతి ఇవ్వాలి 
నిరుద్యోగ భృతిపై నాలుగేళ్లు నాన్చిన ప్రభుత్వ ఇపుడు షరతులతో కొద్దిమందికే భృతిని పరిమితి చేయాలనుకోవడం సరికాదు. చిన్న చిన్న ఐటీ కంపెనీలకే కోట్లాది రూపాయల రాయితీలను మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. కానీ నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయడంలేదు. ఉద్గోగాలు వస్తాయని గత నాలుగు సంవత్సరాలుగా శిక్షణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో అందరికీ బేషరుతుగా భృతి చెల్లించాలి.  
– నూర్‌ మహమ్మద్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి 

 ఎన్నికల ముందు భృతి ప్రకటిస్తారా? 
గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చే ముందు ఇస్తామని ప్రకటించడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. కేవలం ఎన్నికల దృష్టితో ఈ ప్రకటన చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఆదుకునేందుకు మాత్రం కాదు. బేషరుతుగా నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలి. వయో పరిమితి దాటిన అభ్యర్థులకూ భృతి కల్పించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.80 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.  
– సలాంబాబు, వైఎస్సార్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement