బి.ఆనంద్ మృతదేహం
అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం. లేదంటే రూ. 2వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తా’ అంటూ 2014లో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తానిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. ఉద్యోగాల కల్పన ఊసే లేకుండా పోయింది. తమ చదువులకు తగ్గ ఉద్యోగాలు దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలసపోతోంది. నిరుద్యోగ భృతి అందని ద్రాక్షగా మారింది. ఇదిగో.. అదిగో అంటూ ఇంత కాలం మాటల గారడీతో నెట్టుకొచ్చిన చంద్రబాబు వైఖరితో విసుగు చెందిన ఓ నిరుద్యోగి.. చివరకు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు.
చిలమత్తూరు: తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదంటూ మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ వై.గొల్లపల్లికి చెందిన ఆదిమూర్తి, అంజనమ్మ దంపతులకు బి.ఆనంద్(24) ఏకైక కుమారుడు. ఎంబీఏ చేస్తుండగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో బెంగుళూరుకు చేరుకుని సెక్యూరిటీ గార్డ్‌గా కొన్ని రోజులు పనిచేశాడు. వస్తున్న సంపాదన మహానగరంలో తన జీవనానికే సరిపోక ఇబ్బందులు పడ్డాడు. కష్టమో.. నష్టమో.. ఉన్న ఊళ్లోనే పని చేసుకుంటూ తల్లిదండ్రుల బాగోగులు దగ్గరుండి చూసుకోవాలని భావించిన అతను బెంగళూరును విడిచి తిరిగి గొల్లపల్లికి చేరుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే బతుకు తెరువు కోసం అతను చేయని పని అంటూ లేదు. అయినా అరకొర సంపాదన అతన్ని కుంగదీస్తూ వచ్చింది. తన చదువుకు తగ్గ ఉద్యోగం లేదని పలువురితో అతను వాపోయేవాడు. ఈ నాలుగేళ్లుగా ఉద్యోగాల వేటలో అతను అలసిపోయాడు. తనకు ఉద్యోగం లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా పోషించాలి అంటూ తనలోతానే మదనపడుతూ వచ్చిన ఆనంద్.. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెరువు గట్ట వద్దకెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన పశువుల కాపరులు.. అక్కడ పడి ఉన్న ఆనంద్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున చెరువు గట్టు వద్దకు చేరుకుని ఆనంద్ మృతదేహాన్ని పరిశీలించారు. వృద్ధాప్యంతో తమకు దిక్కెవరు అంటూ తల్లిదండ్రుల రోదన స్థానికులను కలిచివేసింది. ఘటనపై ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment