దళితుల భూములపై సర్కారు డేగ
పరిశ్రమల కోసమంటూ అసైన్డ్ భూములు లాక్కుంటున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: తరతరాలుగా స్వేదం చిందించి సాగులోకి తెచ్చుకున్న దళితుల భూములను ప్రభుత్వం లాగేసుకుంటోంది. అడ్డొస్తే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఉన్న దళితులకు పట్టాలిస్తామని, అసైన్డ్ భూములకు నీళ్లిస్తామని ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడా భూములను బడాబాబులకు కట్టబెడతానంటోంది. ఈ పరిణామాలకు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతం మినహాయింపు కాదు.
యావత్ రాష్ట్రంలోని దళిత వర్గాలు సర్కారు భూదాహానికి దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ప్రాణాలకు తెగించి పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. సర్కారు ఏర్పడి మూడేళ్లయినా ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ రాలేదు. పట్టుమని వంద మందికి ఉపాధి లభించిందీ లేదు. ప్రభుత్వం మాత్రం కుప్పలు తెప్పలుగా పరిశ్రమలు వస్తాయని, అందుకోసం 15 లక్షల ఎకరాలతో భూ బ్యాంక్ సిద్ధం చేయాలని ఏపీఐఐసీని ఆదేశించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ పేద వర్గాల అసైన్డ్ భూములపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
‘సీమ’లో బడుగు రైతులపై ఉక్కుపాదం
చిత్తూరు జిల్లాలోని 22 మండలాల పరిధిలో 1,60,938 ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను తయారు చేసేందుకు ఏపీఐఐసీ సిద్ధమైంది. ఇందులో దళిత వర్గాల అధీనంలో ఉన్న అసైన్డ్ భూములే ఎక్కువగా ఉన్నాయి. తూర్పు నియోజకవర్గాలైన సత్యవేడు, శ్రీకాళహస్తిపై ప్రధానంగా కన్నేశారు. కర్నూలు జిల్లాలో 45,166 ఎకరాల భూమిని భూ బ్యాంక్‌గా గుర్తించారు. కర్నూలు, నంద్యాల, పాణ్యం, కల్లూరు, ఆదోని, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, ఓర్వకల్లు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల పరిధిలోని దళిత కుటుంబాల చేతుల్లో ఎన్నో ఏళ్లుగా దాదాపు 25 వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు మొదలైంది. అనంతపురం జిల్లా ధర్మవరం, అనంతపురం, పెనుకొండ, కళ్యాణదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్ల పరిధిలో 20 వేల ఎకరాల దళితుల భూములపై కార్పొరేట్ సంస్థలు కన్నేశాయి. వైఎస్‌ఆర్ జిల్లాలో 1.05 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామిక పెద్దలకు అప్పగించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఇప్పటికే 78 వేల ఎకరాలు సేకరించినట్టు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన భూమిని సేకరించేందుకు సర్వేలు పూర్తయ్యాయి.
కన్ను పడితే చాలు ఖాళీ చేయాల్సిందే..
విజయనగరం జిల్లా గజపతినగరం పరిధిలోని కొణిశ రెవెన్యూ పరిధిలో 15 ఎకరాల భూమి 30 ఏళ్లుగా దళితుల అధీనంలో ఉంది. కొండలు తవ్వి, డొంకలు, తుప్పలు తొలగించి మరీ ఈ భూమిని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల కన్నుపడటంతో దళితులను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ ఇటీవలే బోర్డులు కూడా పెట్టింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా మంటలు రేపుతోంది. భోగాపురం మండలం పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 1205 కుటుంబాలను రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మొత్తం 5,311 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2 వేల ఎకరాల్లో పేద దళిత వర్గాలున్నారు. ఇప్పటికే 2,628 మంది రైతులు తమ అభ్యంతరాలను రాత పూర్వకంగా తెలిపారు. అయినా ప్రభుత్వం కనికరం లేకుండా ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయించే ప్రయత్నాల్లోనే ఉంది.
► శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ పొగలు దళితుల జీవితాల్లో కార్చిచ్చు పెడుతున్నాయి. ఇప్పటికి 4,601 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 3 వేల ఎకరాలు దళిత వర్గాలకు చెందినదే. జిల్లాలో పొలాకీ థర్మల్ ప్లాంట్ కోసం 8 గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాలను ప్రభుత్వం లాక్కునేందుకు కసరత్తు చేస్తోంది.
► కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు పేరుతో పేద దళిత వర్గాలపై సర్కారీ పెద్దలు స్వారీ చేస్తున్నారు. 22 గ్రామాల్లో 14,472 ఎకరాల పట్టా భూములకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది కాకుండా 14,800 ఎకరాల దళితుల అసైన్డ్ భూమిపై కన్నేసింది. ఇప్పటికే 30 మంది తహసీల్దార్లు, 40 మంది సర్వేయర్లతో సర్వే చేయిం చింది. 26 వేల ఎకరాల అటవీ భూమిని డీనో టిఫై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన, హరిజనులే జీవనం సాగిస్తున్నారు.
► తూర్పుగోదావరి జిల్లాలో 49,427 ఎకరాలను పరిశ్రమల కోసం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 25 వేల ఎకరాలను గుర్తించారు. ఇందులో 18,413 ఎకరాలు దళిత వర్గాలకు చెందిన అసైన్డ్ భూములే. పశ్చిమగోదావరి జిల్లాలో 16 వేల అటవీ భూములను తీసుకునే ప్రయత్నం ఊపందుకుంది.
► నెల్లూరు జిల్లాలో సెజ్‌లు, పోర్ట్‌లు దళితుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ జిల్లాలో 75 వేల ఎకరాల భూ బ్యాంక్ టార్గెట్. ప్రకాశం జిల్లాలో 1,97,067 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇందులో 41,304 ఎకరాల భూమి దళిత వర్గాల చేతుల్లో ఉంది.
ఏ ఎదను కదిపినా అదే బాధే..
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి, పెదరావుపల్లి, కాటకాపల్లి, గొల్లపేట, ఎల్ కోట మండలం భీమాళిలో దళిత కుటుంబాలే ఎక్కువ. అక్కడ వందలాది మంది దళితులు 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో తరతరాలుగా మామిడి, జీడిమామిడి తోటలను సాగు చేస్తున్నారు. తాతల కాలంలోనే కొండలు.. గుట్టలు బాగు చేసుకుని బతుకు బాటలు వేసుకున్నారు. ఇప్పుడీ భూమిలో 173 ఎకరాలు పతంజలి ఫుడ్ పార్క్‌కు ప్రభుత్వం రాసిచ్చేసింది. దళితులను ఖాళీ చేయమంటూ అధికారులు వేధిస్తున్నారు. డాక్యుమెంట్లు లేవంటూ అరకొర పరిహారం ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో ఏ దళిత కుటుంబాన్ని కదిలించినా ఆందోళనే కన్పిస్తోంది. వేపాడు మండలం మారిక గ్రామ భూములపై అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడటంతో గిరిజనులను బెదిరిస్తున్నారు.