రాజధానిలో 'బినామీ' దెయ్యం
దళితుల భూముల్లో కాసుల వేట.. 15 గ్రామాల్లో 990 ఎకరాలు హాంఫట్
- దొడ్డిదారిన అసైన్డ్,లంక భూముల రిజిస్ట్రేషన్
- బినామీల ముసుగులో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల దందా
- రిజిస్ట్రేషన్లకు ముందే అడంగల్, 1 బీలోకి అసైన్డ్ భూములు
- రెగ్యులరైజ్ చేసి పూలింగ్ యత్నం
- విలువైన ప్లాట్లు కొట్టేసే పన్నాగం
- ఆక్రమించుకున్న భూముల విలువ రూ.1,980 కోట్లు
- కృష్ణా తీర భూముల్లో రిసార్టులు, మల్టీప్లెక్స్‌లు కట్టాలని ప్లాన్
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో భారీ భూ బాగోతం బయటపడింది. అమరావతి పరిధిలో పేదల జీవనాధారం కోసం ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, లంక భూములను మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు బినామీ పేర్లతో దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. పేదలను భయపెట్టి, ఒత్తిడి తెచ్చి, ఎంతోకొంత చేతిలో పెట్టి నోరు మూయించారు. రాజధాని పరిధిలోని 15 గ్రామాల్లో రూ.1,980 కోట్ల విలువైన 990 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాహా చేశారు. అయితే, ఇందులో 507 రిజిస్ట్రేషన్లకు సంబంధించి 660 ఎకరాలను అధికారులు పెండింగ్‌లో పెట్టారు. వీటికోసం ప్రత్యేక జీవో తెచ్చి, రెగ్యులరైజ్ చేసుకుని, ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ)కు ఇచ్చి, ప్రభుత్వం నుంచి విలువైన ప్లాట్లు కొట్టేయటానికి అక్రమార్కులు పన్నాగాలు పన్నుతున్నారు. 330 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగి, డాక్యుమెంట్ నంబర్లు కూడా వచ్చినట్లు సమాచారం.
సర్కారు భూములే టార్గెట్
అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు.. పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపై కన్నేశారు. తుళ్లూరు, మంగళగిరి,తాడేపల్లి పరిధిలో 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్ జమీందార్ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్ జమీందార్ భూములు ఉన్నాయి. వీటిని 1954, 1971, 1976, 2005లో భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం పంచిపెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను టార్గెట్ చేశారు. 990 ఎకరాల అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు.
ఒత్తిళ్లు.. బెదిరింపులు.. పైరవీలు
అసైన్డ్ భూముల సాగుదారులను దళారుల సహకారంతో బెదిరించారు. కొందరికి డబ్బు ఆశ చూపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు డబ్బుకు లొంగి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేశారు. మరికొందరిని బెదిరించి సంతకాలు చేయించుకున్నారు. ఇంకొందరిని బం«ధువుల ద్వారా పైరవీలు చేయించి లొంగదీసుకున్నారు. వేటికీ లొంగని వారిని పోలీసుల చేత భయపెట్టారు. అక్రమ కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. అలా ఒప్పించి ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున అనుభవదారులకు ముట్టజెప్పారు. రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు.
తెరముందు బినామీలే..
వెంకటపాలెం గ్రామానికి చెందిన కొలికిపూడి ఏసుదాసుకి సర్వే నంబర్ 298/2లో 1.17 ఎకరాల భూమి ఉంది. ఆయన మరణించాక భార్య కొలికిపూడి ఎస్తేరురాణి పేరిట పాసుపుస్తకం, టైటిల్ డీడ్ ఇచ్చారు. అయితే, ఈ భూమిని 2015 అక్టోబర్ 19న అరుణ్‌కుమార్ కంటి మహంతి పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందుకుగాను ఎస్తేరురాణికి రూ.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. సర్వే నంబర్ 293/3లో నీలం నాగమణి అలియాస్ నాగమ్మ పేరిట 99 సెంట్లు, 302/9లో పులి అబ్రహం పేరిట 1.98 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని విశాఖపట్నానికి చెందిన అరుణ్‌కుమార్ కంటి మహంతి, సెరీన్ వివేక కంటి మహింతి, కోనేరు కుటుంబరావు, కోనేరు హిమబిందుకు విక్రయించినట్లు 2015 అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి బినామీలని సమాచారం. వెంకటపాలెం గ్రామంలో 330 ఎకరాల లంక, అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఉద్ధండ్రాయునిపాలెం, రాయపూడి, నవులూరు, కురగల్లు పరిధిలో అత్యధికంగా ప్రభుత్వ, లంక భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఆన్‌లైన్‌లో రికార్డులు మాయం
అసైన్డ్, లంక భూములను కొట్టేసే కుట్రలో భాగంగా టీడీపీ పెద్దలు ముందుగా రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపారు. ప్రభుత్వ భూములను రెవెన్యూ రికార్డులైన అడంగల్, 1బీలో నమోదు చేయించారు. వాటి ఆధారంగా రిజిస్ట్రార్లపై ఒత్తిడి చేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ తతంగమంతా పూర్తయ్యాక ఆన్‌లైన్‌లో అడంగల్, 1బీలను మాయం చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. అనంతరం వాటిని ల్యాండ్‌పూలింగ్‌కి ఇచ్చి, పరిహారం కింద ప్రభుత్వం నుంచి అత్యంత విలువైన ప్లాట్లు తీసుకోవాలని భావిస్తున్నారు. కృష్ణా నదీ తీరాన ఉన్న భూములను మాత్రం పూలింగ్‌కు ఇవ్వకుండా అందులో రిసార్టులు, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆక్రమించుకున్న అసైన్డ్, లంక భూముల విలువ దాదాపు రూ.1,980 కోట్లు ఉంటుందని అంచనా.