గల్ఫ్ బాధితులను పట్టించుకోండి
Published Thu, Sep 12 2013 2:31 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM
నందిపేట, న్యూస్‌లైన్ :గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బాధితులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులను దిగ్బంధిస్తామని స్వదేశీజాగరణ మంచ్ కేంద్ర కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహానాయుడు స్పష్టం చేశారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్ బాధితుల గర్జన పేరుతో ఈనెల 8న ఆర్మూర్‌లో జరిగిన సభ విజయవంతమైందన్నారు.
అయినప్పటికీ బాధితుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. గల్ఫ్ బాధితుల కోసం రెండు వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెంట్ల వ్యవ స్థను రద్దుచేసి విదేశాల్లో ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వ సంస్థ ద్వారా నియామకాలు చేపట్టాలని కోరారు. పావలావడ్డీకి రుణాలు ఇస్తే వారు కొంతవరకైనా కోలుకోవడానికి ఆస్కారముంటుందన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ‘గల్ఫ్ బాధిత పోరాట సమితి’పేరుతో కమిటీలు వేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలోనే మొట్టమొదట నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో కమిటీని వేసినట్లు తెలిపారు.
Advertisement