ధర్మాసుపత్రే దిక్కు | Government issues restrictions for Health cards | Sakshi
Sakshi News home page

ధర్మాసుపత్రే దిక్కు

Published Tue, Dec 31 2013 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

ధర్మాసుపత్రే దిక్కు

ధర్మాసుపత్రే దిక్కు

హెల్త్ కార్డులకు సర్కారీ ని‘బంధనాలు’
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్
347 జబ్బులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స
కార్పొరేట్ ఆస్పత్రుల్లో వాటికి వైద్యం లేనట్లే
ఆధునిక చికిత్స కూడా చేయొద్దట
18 ఏళ్ల నాటి పద్ధతులే అనుసరించాలట
లేదంటే బిల్లులు చెల్లించబోమంటూ ఆంక్షలు
దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కూడా ఇవ్వరు
తీవ్రంగా మండిపడుతున్న ఉద్యోగులు
సర్కారీ వైద్యానికైతే కార్డులెందుకంటూ ధ్వజం


 
 సాక్షి, హైదరాబాద్: మీరు ప్రభుత్వోద్యోగా? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉద్యోగుల హెల్త్ కార్డు పథకం’ కింద కార్డు తీసుకున్నారా? కానీ అది దాదాపుగా ధర్మాసుపత్రి వైద్యానికి మాత్రమే పరిమితం! ఆ కార్డుపై అపోలో, కేర్, గ్లోబల్, స్టార్ వంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి మీకు ప్రవేశం లేదు. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా? ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్యం చేయించుకొమ్మనే పక్షంలో ఇక కార్డు ఎందుకంటూ నిట్టూరుస్తున్నారా? కానీ అదంతేనంటోంది రాష్ట్ర ప్రభుత్వం! దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో కూడా కేవలం 133 జబ్బులకే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలనే నిబంధన ఉంది. కానీ ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వోద్యోగులకు మాత్రం కాన్పుతో సహా ఏకంగా 347 రకాల జబ్బులకు ప్రభుత్వాసుపత్రులకే వెళ్లాలంటూ సర్కారు ఆంక్షలు విధించింది. ఇదొక్కటే కాదు, ఈ పథకంలో ఇలాంటి వింత ని‘బంధనాలు’ మరెన్నో ఉన్నాయి.

దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. కాన్పులతో పాటు బీపీ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, డెంగీ, మలేరియా, గర్భసంచి తొలగింపు, నడుం నొప్పి, నరాల సమస్యలు, హెర్నియా, అపెండసెక్టమీ, ప్రొస్టెక్టమీ, రీనల్ సమస్యలు తదితర 347 జబ్బులకు ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలనే నిబంధనలపై ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి నిబంధనలు పెట్టిన ఉన్నతాధికారులు తమ కుటుంబసభ్యులకు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించే ధైర్యం చేస్తారా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నగదు ప్రమేయం లేని వైద్యం అందిస్తామంటూ ఘనంగా హెల్త్ కార్డుల పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం, అది పెట్టిన నిబంధనలకు అంగీకరించిన ఉద్యోగ సంఘాలే సమాధానం చెప్పాని వారు డిమాండ్ చేస్తున్నారు.

‘‘ప్రభుత్వాసుపత్రులు ఉన్నదే ఉచితంగా వైద్యం చేయడానికి! దాదాపుగా అన్ని వ్యాధులకూ అక్కడికే వెళాల్సి వస్తే మాకీ కార్డులెందుకు? వాటికోసం చందాలు కట్టడమెందుకు? ఈ మాత్రం దానికి డేటా నమోదు, కార్డుల జారీ, ఏకంగా 27 సార్లు ఉద్యోగ సంఘాలతో ఉన్నతాధికారుల చర్చలు... ఇంత తతంగం దేనికి?’’ అంటూ ఉద్యోగులు ముక్త కంఠంతో దుయ్యబడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వసతుల కల్పనకు, స్పెషలిస్టుల నియామకానికి చర్యలు చేపట్టకుండా తమను ధర్మాసుపత్రి వైద్యానికి బలి చేయాలనుకోవడం దారుణమంటూ ఆగ్రహిస్తున్నారు. పైగా దాదాపు అన్ని డివిజన్ కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రులరూ రెఫరల్ ఆసుపత్రులుగా జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 ఆధునిక వైద్యం అందదు

 దశాబ్ద కాలంగా వైద్యశాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు, నూతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఉద్యోగులకు మాత్రం హెల్త్ కార్డులపై ఆధునిక వైద్యం అందించడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్దేశించింది! వారికి చేసే వైద్యంలో 18 ఏళ్ల నాటి చికిత్స విధానాలను మాత్రమే అనుసరించాలని నిబంధన విధించింది. దీనిపై వైద్యులు కూడా విస్తుపోతున్నారు. ‘‘ప్రభుత్వం సూచించినట్టుగానే వైద్యం చేస్తే విదేశాల్లోనైతే ముందుగా డాక్టర్లను శిక్షిస్తారు! ఎవరైనా ఆధునిక వైద్యాన్నే కోరుకుంటారు. రోగకారక క్రిములు నిరోధకత పెంచుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక చికిత్సా పద్ధతులను, మందులను వాడాల్సి ఉంటుంది. కానీ హెల్త్‌కార్డుల పథకం నిబంధనలు మాత్రం అందుకు భిన్నంగా, తిరోగామి దిశగా ఉన్నాయి’’ అని వారంటున్నారు. సర్కారుకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. తాను పెట్టిన నిబంధనల ప్రకారం వైద్యం చేస్తేనే ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తానంటోంది. ఆధునిక పద్ధతులు అనుసరిస్తే బిల్లులు వచ్చే అవకాశం లేదంటున్నారు. పైగా దీర్ఘకాలిక వ్యాధులకు హెల్త్ కార్డులపై మందులు కూడా ఇవ్వబోరని నిబంధనల్లో పేర్కొన్నారు.

 వైద్యానికి కార్పొరేట్ల ససేమిరా

 అపోలో, కేర్, కామినేని, యశోద, గ్లోబల్, స్టార్ వంటి రాష్ట్రంలోని 23 ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వమిచ్చిన హెల్త్ కార్డులపై వైద్యం అందించడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీలు తమకు గిట్టుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయంతీసుకున్నామని వాటి యాజమాన్యాలు స్పష్టం చేశాయి. కొన్ని ప్యాకేజీలకైనా వైద్యం చేసేలా వాటిని ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఇప్పటిదాకా ఫలితం రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement