విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : నాలుగేళ్లుగా ఉద్యోగులు కోరుతున్న హెల్త్‌కార్డులపై (నగదు రహిత వైద్యం) ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న ఈ పథకంలో నమోదు కోసం డిసెంబర్ 5 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పొందవచ్చు. పథకం అమలులోకి వస్తే జిల్లాలో 11 వేలమంది ఉపాధ్యాయులు, సుమారు 20 వేల మంది ఇతర ఉద్యోగులు లబ్ధిపొందుతారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారుల అవగాహన కోసం పలు విషయాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు, అన్ని సర్వీసుల పింఛన్‌దారులు, కుటుంబ పింఛన్‌దారులు అర్హులు. ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు, 25 ఏళ్లలోపు నిరుద్యోగ కుమారుడు, అవివాహిత లేదా విడాకులు తీసుకున్న నిరుద్యోగ కుమార్తె పథకానికి అర్హులవుతారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు లేదా పింఛన్‌దారులైతే ఒకరి కంట్రిబ్యూషన్ సరిపోతుంది. ఏహెచ్‌సీటీ నిబంధనలు పాటించే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రుల జాబితాను www.gov.inలో పొందుపరుస్తారు.
తాత్కాలిక కార్డులకు www.ehf.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు సర్వీస్ పుస్తకంలోని పేజీ 1.2 జిరాక్స్ ప్రతులు, కొత్త సర్వీస్ పుస్తకం అయితే 4,5 పేజీల జిరాక్స్ ప్రతులు, ఫొటో, ఆధార్‌కార్డు జతచేయాలి. ఆరోగ్యశ్రీ ట్రస్టు సిబ్బంది ఉద్యోగి దరఖాస్తును పరిశీలించిన అనంతరం తాత్కాలిక ఆరోగ్యకార్డులు జారీ చేస్తారు. వీటిని రూ. 25 చెల్లించి ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు. ఈ కార్డులు 90 రోజులు లేదా శాశ్వత కార్డులు జారీ అయ్యే వరకు పనిచేస్తాయి.
ఉద్యోగి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత శాశ్వత కార్డులు జారీ చేస్తారు. కార్డులు సీఐసీ (కంప్యూటర్ ఐడెంటిఫై సెంటర్) ద్వారా పొందాల్సి ఉంటుంది. ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనూ ప్రభుత్వం సీఐసీ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ విషయమై ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్ కూడా వస్తుంది. ఉద్యోగి కుటుంబసభ్యులందరూ సీఐసీకి వెళ్లి వేలిముద్రలు నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన 30 రోజుల వ్యవధిలో బయోమెట్రిక్ ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు.
ఉద్యోగులకు హెల్త్‌కార్డు లు
Published Mon, Nov 18 2013 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement
Advertisement