కడప: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన హెల్త్‌కార్డుల పథకం తప్పుల తడకగా మారింది. ఉద్యోగులకు ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించేందుకు సంబంధించి చాలారోజులుగా ప్రభుత్వం నాన బెడుతూ 2014 చివరిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే హెల్త్‌కార్డులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే హెల్త్‌కార్డుల వ్యవహారంలో మొత్తం అంతా తప్పులు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. పథకానికి సంబంధించిన కార్డులతోపాటు ఇతరత్రా తప్పులు దొర్లడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నేరుగా పెన్షనర్స్, ఇతరులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆర్థికశాఖ పరిధిలో వెబ్‌సైట్ నడుస్తుండడం, హెల్త్‌కార్డులకు ప్రత్యేకంగా సైట్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఏపీ వారికి తెలంగాణ ప్రభుత్వం పేరుతో కార్డులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి చాలామందికి తెలంగాణ ప్రభుత్వం పేరుతో హెల్త్‌కార్డులు రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని కడపలో పనిచేస్తున్న తమకు తెలంగాణ ముద్ర ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చాలామందికి తెలంగాణ ప్రభుత్వం పేరుతోనే కార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్డు ఒకరి పేరుతో ఉంటే ఫోటో మరొకరిది ఉండడం లాంటి తప్పులున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో చెప్పేవారు లేకపోగా, ఏదైనా విపత్కరపరిస్థితులు ఎదురైనప్పుడు ఆస్ప్రత్రికి వెళితే తెలంగాణ ప్రభుత్వం పేరుతో ఉన్న కార్డులు చెల్లకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
వెబ్‌సైట్‌లో ఆప్షన్లు లేక ఇబ్బందులు
హెల్త్‌కార్డులకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్‌సైట్ లేకపోవడంతో ఆప్షన్ల విషయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వెబ్‌సైట్లలో ఎడిట్, డిలీట్ లాంటి ఆప్షన్లు లేకపోవడంతో ఏదైనా ఒక అక్షరం తప్పు జరిగినా సరిదిద్దుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఉద్యోగి పేరు వెంకట రమణ అయితే ఒక అక్షరం తేడా వచ్చినా నిలిచిపోతున్నాయి. తేడాలున్న కార్డులను నిలిపేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. పైగా నో రికార్డు ఫౌండ్ అని చూపిస్తుండటంతో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు.
కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ఎగనామం
రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగస్తుల వివరాలను అప్పట్లో ప్రభుత్వం సేకరించింది. దాని ఆధారంగానే ప్రభుత్వం హెల్త్‌కార్డులను మంజూరు చేస్తోంది. అయితే, విభజన అనంతరం కొద్దిరోజుల తర్వాత ఉద్యోగంలో కొత్తగా చేరిన వారి వివరాలను ప్రభుత్వం తీసుకోలేదు. ఎంటర్ చేయడానికి అవకాశం లేకపోవడంతో కొత్తగా చేరిన ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు దాదాపు లేనట్లేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ కూడా చాలా శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామందికి హెల్త్‌కార్డులు రాకపోవడం ఆందోళన కలిగించే పరిణామం.
ఎవరిని అడగాలో తెలీక అవస్థలు
జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే హెల్త్‌కార్డులకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఇప్పటికే ట్రెజరీ అధికారులను, ఆరోగ్యశ్రీ, 108, కలెక్టరేట్, ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. చివరికి హెల్త్‌కార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరిని అడిగి తెలుసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. అలాగే టోల్‌ఫ్రీ నెంబరు కూడా లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు విన్నవిస్తున్నారు.
తప్పుల తడక
Published Wed, Feb 4 2015 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement