
'త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాల తరలింపు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నుంచి పరిపాలన సాగించడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలను దశలవారీగా అక్కడికి తరలిస్తామని ప్రసార, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం అడ్డగోలుగా రాజధాని లేకుండానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. సవాళ్లను అవకాశంగా మలుచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు.
అమరావతి నిర్మాణానికి ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అందించిందన్నారు. రాజధాని నగరం నిర్మించేలోగా.. విజయవాడలో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసి పరిపాలన సాగిస్తామని ఆయన చెప్పారు. వీలైనంత తొందరగా విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి.. తాత్కాలిక భవనాల ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే.. దశల వారీగా కార్యాలయాలను తరలించి పరిపాలన సాగిస్తామని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.