ముందైతే నోటిఫికేషన్ ఇవ్వండి: ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో సందిగ్ధంలో పడిన వైద్యుల భర్తీపై ఆశలు మళ్లీ చిగురించాయి. వైద్యుల పోస్టుల నియామకాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నా ముందైతే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. వైద్యుల భర్తీ ఏపీపీఎస్సీ పరిధిలో లేకపోవడంతో నేరుగా ఆ శాఖలే నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టుకోవాలని పేర్కొంది. రాతపరీక్ష కాకుండా మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశాలిచ్చింది. గత నాలుగు రోజులుగా ఈ అంశంపై కసరత్తు చేసిన ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓకే చెప్పడంతో సెప్టెంబర్ 15వ తేదీలోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏ పోస్టులు ఎన్ని..?
ఆరోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లను ఫీడింగ్ కేటగిరీగా పరిగణిస్తారు. 1,190పైగా సీఏఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేసేందుకు వీరిని నియమిస్తారు. బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకం కూడా భారీగానే చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బోధనాసుపత్రుల్లో కలిపి 554 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ తర్వాత 251 అసోసియేట్ ప్రొఫెసర్లు, 230 ప్రొఫెసర్ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని వైద్య విద్యాశాఖ యోచిస్తోంది. అలాగే మరో 1,700 స్టాఫ్ నర్సుల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఈ నియామకాలన్నీ పూర్తయితే గత నాలుగేళ్లలో ఇదే పెద్ద రిక్రూట్‌మెంట్ కానుంది. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత ఇరు ప్రాంతాల ఉద్యోగుల్లో అంతరాలు ఏర్పడ్డాయి. వైద్యుల పోస్టులన్నీ రాష్ట్రస్థాయి పోస్టులు. ఉదాహరణకు విజయనగరం జిల్లాకు చెందిన వైద్యుడు మెరిట్‌పై హైదరాబాద్‌లో పోస్టింగ్ తీసుకుంటే ఇక్కడ గొడవలు వచ్చే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. మెరిట్ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఇన్‌సర్వీస్ (ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది) వారికి 15 శాతం వెయిటేజీ ఇస్తారు.