అభివృద్ధి పేరిట ప్రభుత్వం హడావుడి చేయడం.. అందుకు తగినట్లుగా అధికారులు అంకెల గారడీ చేయడం పరిపాటిగా మారింది. వాస్తవ విషయానికొస్తే.. కాగితాల్లో చూపిన లెక్కలేవీ కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇదేమంటే ప్రభుత్వం ఏమి చేస్తారంటే నివేదిక రూపంలో పంపామని.. అమలు తమ చేతుల్లో లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో అదనపు ఆయకట్టు అభివృద్ధి ఈ కోవకే చెందుతుంది.
కర్నూలు సిటీ:
కరువు నేలపై కన్నీళ్లు పారించయినా ఈ ఏడాది అదనపు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఆ మేరకు జల వనరుల శాఖ అధికారులు జిల్లా వాస్తవ పరిస్థితి తెలిసీ.. రెండంకెల అభివృద్ధి పేరిట సాగునీటి ప్రాజెక్టుల కింద అదనపు ఆయకట్టు అభివృద్ధికి గత జూన్‌లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ కాలువ కింద 1.92 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేస్తామని అందులో వెల్లడించారు. ఇందులో ఎస్‌ఆర్‌బీసీ కింద 1,703 ఎకరాలు, తెలుగుగంగ కింద 39,160, హంద్రీనీవా కింద 73వేలు, గురురాఘవేంద్ర కింద 37వేలు, సిద్ధాపురం ఎత్తిపోతల కింద 21,300, చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 20వేల ఎకరాలను అదనంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే జిల్లాలో వివిధ కాల్వల కింద మొత్తం 7,79,136 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో గత ఏడాది వివిధ కారణాలతో 4.28 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. మిగిలిన ఆయకట్టును అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఆయా ప్రాజెక్టుల పనులు సక్రమంగా చేపట్టకపోవడమే అందుకు కారణమైంది. అలాంటప్పుడు అదనపు ఆయకట్టు అభివృద్ధి ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకమైంది. ఈనెల 13న నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం(ఐఏబీ)లోనూ అదనపు ఆయకట్టు ఊసే కరువైంది. ప్రభుత్వానికి ప్రతిపాదించిన విధంగా అదనపు ఆయకట్టు ప్రస్తావనే లేకుండా సమావేశం సాగింది.
సగం ఆయకట్టుకే గతి లేదు..
తుంగభద్ర దిగువ కాల్వ కింద ఖరీఫ్, రబీ సీజన్‌లలో స్థిరీకరించిన ఆయకట్టు 1,51,134 ఎకరాలు. ఇందులో రెండు సీజన్‌లకు కలిపి 60వేల ఎకరాలకు మించి నీరివ్వలేకపోతున్నారు. కాల్వను పూర్తి స్థాయిలో ఆధునీకరించకపోవడం, కన్నడిగుల జలచౌర్యాన్ని నిలువరించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
కేసీ కాల్వ కింద జిల్లాలో 1,84,209 ఎకరాలకు గాను 1.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. కెనాల్ డిస్ట్రిబ్యూటరీలకు మరమ్మతులు చేయకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు.
శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద 1వ బ్లాక్ నుంచి 16 బ్లాకుల వరకు 1,53,936 ఎకరాల ఆయకట్టు ఉం డగా.. గతేడాది ఖరీఫ్‌లో 1వ బ్లాకు నుంచి 11 బ్లాకు వరకు 81879 ఎకరాలు, 12 నుంచి 16 వరకున్న బ్లాకులకు 33,150 ఎకరాల ఆయకట్టు సాగయింది. ప్రస్తుతం ఈ కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెండింగ్ పనులు పూర్తయితే తప్ప.. పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందని పరిస్థితి.
తెలుగుగంగా కాల్వ కింద మొత్తం 1,14,500 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో 75,340 ఎకరాల ఆయకట్టు మాత్రమే యేటా సాగవుతోంది. కెనాల్‌కు డిస్ట్రిబ్యూటరీ ఉన్నా.. పిల్ల కాలువలు లేకపోవడంతో 39,160 ఎకరాలకు నీరు కరువైంది.
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది. డిస్ట్రిబ్యూటరీలు, సబ్ కెనాల్స్, పిల్ల కాలువలు లేకపోవడం, ఇందుకు అవసరమైన భూములను సేకరించకపోవడంతో గతేడాది ప్రతిపాదించిన 14,500 ఎకరాలను ఈ ఏడాది కూడా ప్రతిపాదించడంతో సరిపెట్టారు.
గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద 50వేల ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా.. ప్రాజెక్టు కింద చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి కాకపోవడంతో 13వేల ఎకరాలకే పరిమితమవుతోంది.
చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 84వేల ఎకరాలు గాను, 40 వేలకు మించి సాగు కావడం లేదు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు వల్ల 16వేల ఎకరాలు అదనంగా ఆయకట్టును అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదించారు.
వర్షాలు కురిస్తేనే అదనపు ఆయకట్టు
వర్షాలు సమృద్ధిగా కురిసి జలశయాలు నిండితేనే అదనపు ఆయకట్టు అభివృద్ధి చెందుతుంది. ఒక్క కాల్వల ద్వారానే కాకుండా చెక్‌డ్యాంలు, ఫారంపాండ్స్, చెరవుల ద్వారా భూగర్భ జలాలు పెరిగితే ఆయకట్టు మెరుగవుతుంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే అదనపు ఆయకట్టు అబివృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆయకట్టు అభివృద్ధికి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - చిట్టిబాబు, చీఫ్ ఇంజనీర్
ఆయకట్టు..కనికట్టు
Published Tue, Jul 21 2015 10:53 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
Advertisement
Advertisement