జల జగడం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :వేసవి రాకుండానే వివిధ రాష్ట్రాల మధ్య మొదలైన జల జగడాలు ఇప్పుడు మన జిల్లాలోని నియోజకవర్గాల మధ్య కూడా చిచ్చు రేపుతున్నాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ నేరుగా కాకపోయినా సాగునీటి విషయంలో ఎవరికి వారు పంతాలు, పట్టుదలకు పోయినట్టు తెలుస్తోంది. ఎండిపోతున్న పొలాలకు నీరు మళ్లిస్తున్న రైతులపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా వారిపై కేసులు పెట్టాల్సిందిగా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. రైతులపై కేసులు పెడితే సహించేది లేదని మంత్రి పీతల సుజాత తెగేసి చెప్పారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం పొద్దుపోయాక చోటుచేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి.
చింతలపూడి నియోజ కవర్గం పరిధిలోని లింగపాలెం మండ లం పాలవాగు సప్లయ్ చానల్ పరి ధిలో సుమారు 1,500 ఎకరాల్లో పంట లు కొద్దిరోజులుగా సాగునీరు అందక ఎండిపోతున్నారుు. కాగా, శివరాత్రి సందర్భంగా దెందులూరు నియోజకవర్గానికి సరిహద్దులో గల బలివే తిరునాళ్ల నిమిత్తం నాగిరెడ్డిగూడెం ప్రాజెక్ట్‌లోని నీటిని తమ్మిలేరు నుంచి నాలుగు రోజులుగా మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 200 మంది రైతులు, స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆదివారం తమ్మిలేరు మీదుగా వెళ్తున్న నీటికి కొద్దిపాటిగా అడ్డువేసి పాలవాగు చానల్‌కు మళ్లించారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అనుచరులతో కలసి ఆదివారం రాత్రి 8గంటల సమయంలో యర్రవారిగూడెం గ్రోయిన్ వద్దకు వెళ్లి హడావుడి చేశారు.
పాలవాగు చానల్‌కు వెళ్లుతున్న నీటిని చూసి అక్కడ ఉన్న ఇరిగేషన్ సిబ్బందిపై మండిపడ్డారు. ‘తమ్మిలేరుకు అడ్డువేసి పాలవాగుకు నీరుతీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారు. గాడిదలు కాస్తున్నారా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అక్కడకు చేరుకున్న ఇరిగేషన్ అధికారులపై కూడా చింతమనేని సీరియస్ అయ్యారు. ‘రేపు ఈ వేళకు మిమ్మల్ని డిస్మిస్ చేయిస్తా’నంటూ హెచ్చరించారని చెబుతున్నారు. అంతేకాకుండా, కాలువకు అడ్డువేసిన రైతులపై కేసులు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైతుల్లో టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని, కేవలం పొలాలు ఎండిపోతున్నందునే నీరు మళ్లించారని అక్కడి ఇరిగేషన్ సిబ్బంది పదేపదే చెప్పినప్పటికీ చింతమనేని శాంతించలేదు. పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కేసులు పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఇరిగేషన్ సిబ్బంది ధర్మాజీగూడెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రైతులుపై ఫిర్యాదు రాస్తుండగా, స్థానిక టీడీపీ నేతలు మంత్రి పీతల సుజాతకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు.
సాగునీరు అడిగిన రైతులపై కేసులా మంత్రి పీతల విస్మయం
రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కడంతో స్పందించిన మంత్రి సుజాత ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి ‘సాగునీరు అడిగిన రైతులపై కేసులు ఎలా పెడతారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని రైతులు, నాయకులపై కేసులు పెడితే సహించేది లేదు’ అని స్పష్టం చేసినట్టు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించాలని, రైతులపై కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని మంత్రి పోలీసులకు సైతం సూచించారు. బలివే తిరునాళ్లు ముగిసిన మరుసటి రోజు నుంచి ఎండిపోతున్న పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. చింతలపూడికే పరిమితం కాకుండా జిల్లా మంత్రిగా సాగునీరందక ఎండిపోతున్న అన్ని ప్రాంతాల్లోని పొలాలకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద పెద్దఎత్తున గుమిగూడిన రైతులు శాంతించి వెళ్లిపోయారు. కాగా, ఎండిపోతున్న పంటలకు నీరు పెట్టుకుంటుంటే కేసులు పెట్టాలని చూస్తారా.. అంటూ ప్రభాకర్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదిలావుండగా, ఇంత జరిగినా ఇరిగేషన్ అధికారులు మాత్రం జరిగిన ఘటనపై నోరు మెదపడం లేదు. ఆదివారం రాత్రి యర్రవారిగూడెం వద్ద ఏం జరిగిందో మాకు తెలియదని ఇరిగేషన్ ఎస్‌ఈ బి.శ్రీనివాసయాదవ్ చెబుతుండగా, ఈఈ సతీష్ కుమార్ మాత్రం శివరాత్రి వేడుకల తర్వాత నీటిని ఎక్కువ మొత్తంలో విడుదల చేయించేందుకు చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు.