వీఆర్వోలతో ప్రభుత్వ విప్ సమావేశం
రికార్డులు తేకపోవడంతో ఆగ్రహం
ఆరా తీస్తే ప్రైవేటు వ్యక్తి ఇంట్లో లభ్యం
కలెక్టర్ ఆదేశాలతో స్వాధీనం
పొందూరు: ప్రైవేటు వ్యక్తి ఇంట్లో రెవెన్యూ రికార్డులను స్థానిక రెవెన్యూ సిబ్బంది మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకొన్నారు. కలెక్టర్ లక్ష్మీన రసింహం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఇన్‌ఛార్జి తహశీల్దార్ కె. శ్రీరాములు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వీఆర్వోలతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తుండగా, వీఆర్వోలు రికార్డులు తీసుకురాకుండా హాజరవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డులు ఎక్కడ ఉన్నాయని ఆరా తీయగా పొందూరులోని ఓ ప్రైవేటు వ్యక్తి ఇంట్లో ఉన్నాయని తెలియడంతో వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి సోదాలు జరిపించారు.
రికార్డులను తహశీల్దార్ కార్యాలయానికి తెప్పించారు. తోలాపి, తాడివలస, పెనుబర్తి, అలమాజీపేట, సింగూరు, బొడ్డేపల్లి, మొదలవలస తదితర గ్రామాలకు చెందిన రికార్డులన్నీ ప్రైవేటు వ్యక్తి కోరుకొండ మోహనరావు ఇంట్లో ఉన్నట్లు వాటిని స్వాధీనంచేసుకుని వచ్చిన సీఎస్‌డీటీ మధుసూదనరావు, ఆర్‌ఐలు మధుసూదనరావు, ప్రవీణ్ తెలిపారు. వన్-బి, ఎఫ్‌ఎంబీ, వీఏ-3 రికార్డులు తహశీల్దార్ కార్యాలయంలోనైనా లేదా వీఆర్‌ఓల వద్దనైనా ఉండాలి. పాస్ పుస్తకాలు జారీ చేయాలంటే వన్-బి తప్పనిసరిగా ఉండాలి. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించాలంటే ఎఫ్‌ఎంబీ ఉండాలి. రైతుల వివరాలు, భూ విస్తీర్ణం అడంగల్‌లో పొందుపరిచేందుకు వీఏ-3 అత్యవసరం.
అలాంటి ముఖ్యమైన రికార్డులన్నీ ఇలా ప్రైవేటు వ్యక్తి ఉంట్లో ఉండటంలో అంతరార్థమేమిటో అంతుబట్టని విషయంగా ఉంది. పైగా కొందరు వీఆర్‌ఓలు రికార్డులు తమ వద్ద లేవని అబద్ధాలు చెప్పడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. కార్యక్రమంలో ఎస్‌ఐ కుమార్ ఉన్నారు.
రెవెన్యూ మాయ...
Published Tue, Jun 9 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM
Advertisement