'ధన్యవాదాలు తెలిపేందుకే కలిశాం'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ను కలిసినట్లు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు మంత్రులు గవర్నర్ను కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించొద్దని, తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని వారు గవర్నర్ను కోరినట్లు సమాచారం.
భేటీ అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతు బొత్స నేతృత్వంలో గవర్నర్ను కలిశామన్నారు. తాము గవర్నర్ను మర్యాదపూర్వకంగానే కలిశామన్నారు. ధన్యవాదాలు తెలిపేందుకే కలిశామని, ఎలాంటి రాజకీయ విషయాలు చర్చించలేదని ఆనం చెప్పటం విశేషం. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనన్నారు.