హైదరాబాద్: సీఎం సీటును కిరణ్ కుమార్ రెడ్డి ఖాళీ చేయటంతో రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపడతారనే దానిపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కిరణ్ కొనసాగనని చెప్పటంతో ఆశావాహులు సీఎం సీటుపై కన్నేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించినా మద్దతు ఇస్తానని ఆయన తెలిపారు. అయితే కొత్త ముఖ్యమంత్రిగా తన ఛాయిస్ ఎస్సీ వర్గానికి చెందిన జేడీ శీలం, కొండ్రు మురళి, పనబాక లక్ష్మి అని అన్నారు. ఒకవేళ అధిష్టానం బొత్స సత్యనారాయణను సీఎంను చేసినా మద్దతు తెలుపుతానని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి అప్పగించినా అభ్యంతరం లేదన్నారు.
మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవద్దని... తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కన్నా లక్ష్మీ నారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి గురువారం గవర్నర్ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.