
ఆయన చేత అబద్ధాలు చెప్పించారు:సీఆర్
అమరావతి : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చేత అబద్దాలు చెప్పించారని శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత సీ. రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సోమవారం గవర్నర్ ప్రసంగమంతా వాస్తవాలకు భిన్నంగా సాగిందని, ఆయన ధోరణి చూస్తుంటే తన కాలం వెళ్లదీస్తున్నట్టుగా ఉందన్నారు. పుష్కరాల్లో 29 మంది చనిపోతే.. బ్రహ్మండంగా జరిగాయనడాన్ని ఆక్షేపించారు. ఎకనామిక్స్ సర్వేలో అత్యంత అవినీతిపరమైన రాష్ట్రంగా ఏపీ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు తనకంటూ ఒక సమాజాన్ని సృష్టించుకుని అందులో బతుకుతున్నారని విమర్శించారు.
రాజ్యాంగపరంగా ఆరు నెలల గ్యాప్ లేకుండా అసెంబ్లీని ఏర్పాటు చేయాలన్న కారణంగానే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ బిల్డింగ్‌లు సుందరంగా ఉంటే సరిపోదని, సభలో అర్ధవంతంగా చర్చలు జరిపి పరిష్కారాలు చూపాలని రామచంద్రయ్య సూచించారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడితేనే రాష్ట్రంలో సులువుగా పోరాడగలుగుతారని అన్నారు. ఆ కేసు వల్ల రాష్ట్రం , ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమన్నా చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు నుంచి త్వరగా బయటపడాలని వ్యాఖ్యానించారు.