'అందుకే యూస్ లెస్ సీఎం అన్నాను'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అధికార టీడీపీ నేతల భూదందాపై వచ్చిన 'రాజధాని భూ దురాక్రమణ' కథనం వాస్తవని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అన్నారు. పక్కా ఆధారాలతో సహా భూ కుంభకోణాన్ని 'సాక్షి' బయటపెట్టిందన్నారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ 'భూముల కుంభకోణంపై సీఎం చంద్రబాబు విచారణకు సిద్ధపడాలి కానీ మీడియాపై, నేతలపై ఎదురుదాడికి దిగడం సరికాదు. రాజధాని ప్రాంతంలో భూ లావాదేవీలన్నీ బోగస్. టీడీపీ నేతలు అసైన్డ్ భూములు కొని రెగ్యులైజేషన్ చేసుకుంటున్నారు.
చంద్రబాబు తన సన్నిహితులకు ధనవంతులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల నుంచి మోసపూరితంగా భూములు లాక్కున్నారు. మరోవైపు నిధుల కేటాయింపు లేకుండా పోలవరం ఎలా పూర్తిచేస్తారని ప్రశ్నిస్తే ప్రభుత్వం స్పందించడం లేదు. పోలవరం పూర్తికాకపోతే రాయలసీమ నాశమవుతుంది. ఈ అంశంపై ఆరోపణలు చేస్తూ యూస్లెస్ సీఎం అని కామెంట్ చేశాను. అది తప్పైనట్టు చంద్రబాబు టీడీపీ నేతలతో నా పై ఆరోపణలు చేపిస్తున్నారు' అని రామచంద్రయ్య తెలిపారు.