సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణంలో అస్తవ్యస్త విధానాలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధానిపై తీసుకునే కీలక నిర్ణయాలు రాజ్యాంగ పరిధిలో ఉండాలని హితవు పలికారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని పేర్కొన్నారు. అమరావతిపై అన్ని ప్రాంతాల్లో అసంతృప్తులు ఉన్నాయని తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కనీస అభిప్రాయాలు తీసుకోలేదని టీడీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణంపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మంగళవారం సుదీర్ఘంగా ప్రసంగించారు.
‘చంద్రబాబు ఊహలతోనే దోపిడీకి రంగం సిద్ధమైందని అప్పుడే భావించా. పదేళ్ల హక్కులున్నా హైదరాబాద్‌ను వదిలేసి వచ్చాం. అమరావతి అనే బూచి చూపించారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఇప్పటికీ కొనసాగుతోంది. చంద్రబాబు విఙ్ఞతతోనే వ్యవహరించారా? రాజధానిలో ఎక్కడ ఏ ఆఫీసు ఉందో కూడా తెలియదు. రాజధాని అభిప్రాయం చెప్పాలని శివరామకృష్ణ కమిటీ వేశారు. కానీ, ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా చంద్రబాబు ఆగలేకపోయారు. బాబు ఎందుకు అలా చేశారో సమాధానం చెప్పాలి.
రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు 10 ఎకరాలకు మించి భూమి అందుబాటులో లేదని చెప్పారు. 70 ఏళ్లుగా అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. అన్ని వర్గాలు, వ్యక్తులు హైదరాబాద్‌లోనే పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ వదిలి వచ్చేందుకు ఎవరికీ ఇష్టం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే.. విభజన జరిగినా మనకు ఆవేదన ఉండేది కావు. భవిష్యత్‌లో మరోసారి దగా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది.
గత ఐదేళ్లలో కేంద్రం 23 విద్యాసంస్థలను ఇస్తే శ్రీకాకుళంలో ఒక్కసంస్థ కూడా ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు పార్టీకి అనేకసార్లు అధికారం ఇచ్చిన మా జిల్లాకు ఒక్క సంస్థ కూడా ఇవ్వలేకపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే బాబు ప్రణాళికలు వేశారని ముందే చెప్పా. లక్షకోట్లు పెడితేకాని చంద్రబాబు అనుకున్న రాజధాని పూర్తవదు. సాధ్యంకాదని తెలిసినా నమ్మించే ప్రయత్నం చేశారు. రాజధాని లోక కల్యాణం కోసమా? లోకేష్ కల్యాణం కోసమా?’అని ధర్మాన చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment