
'అమరావతికి భూములు అప్పగించొద్దు'
శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య
కడప: జిల్లా అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి భూములు మాత్రం అమరావతి కోసం అటవీశాఖకు కట్టబెడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతికి జిల్లా భూములు అప్పగించవద్దంటూ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరామకృష్ణన్ కమిషన్‌ను తోసి రాజని అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం చట్టవిరుద్దమన్నారు. రాజధానికి అమరావతి సురక్షిత ప్రాంతం కాదని చెప్పారు. ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసమే రాజధాని నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ దాన్ని సాధించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ ప్రయత్నించిన దాఖలాలు లేవన్నారు.
పార్టీలకు అతీతంగా నిలదీయాలి
ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా కోరారు. జిల్లాలోని 56 వేల ఎకరాల ప్రభుత్వ భూములను అటవీశాఖకు ఇవ్వడం సమంజసం కాదన్నారు. విభజనతో సీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
రాజధాని నిర్మాణం తక్షణమే ఆపాలి
అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని రాయలసీమ హక్కు అని, శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. సీమను అన్ని విధాలా అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులోమరో చీలిక వస్తుందని తెలిపారు. డీసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సత్తార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాజధాని కోసం ఇక్కడి భూములను ప్రభుత్వం అటవీశాఖకు అప్పగిస్తున్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జె.పెద్దన్న, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్, రాయలసీమ ఉద్యమ నాయకుడు వై.నాగిరెడ్డి, సిద్దేశ్వరం సాధన సమితి జిల్లా కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నీలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.