ఇందూరు, న్యూస్‌లైన్ :పంచాయతీ ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన సిబ్బంది మెడకు ఉచ్చు బిగుస్తోంది. గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను అదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ బాబు విధులకు డుమ్మా కొట్టిన సిబ్బంది వివరాలు తయారు చేయాలని అన్ని డివిజన్‌ల ఆర్డీఓలకు, మండలాల ఎంపీడీఓలకు సూచించారు. ఈ మేరకు అధికారులు ఎన్నికల విధులకు గైర్హాజరైన వారి జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి సిద్ధం చేశారు. వారు తయారు చేసిన జాబితా ప్రకారం 450 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఇతర జిల్లాల్లో ఇపాటికే గైర్హాజరు సిబ్బందిపై కేసులు నమోదు చేసి కోర్టులో ప్రాసిక్యూషన్ కూడా చేశారు. జిల్లాలో అధికారులు కొద్దిగా అలస్యం చేసినప్పటికీ మరో వారం రోజుల్లో కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.
జిల్లా కోర్టులో ప్రాసిక్యూషన్ చేయించాలన్న ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలకు సమాయత్తమవుతున్నారు. లోలోపలే కేసుల నమోదు ప్రక్రియ పూర్తయినప్పటికీ ఎంతమంది ఉద్యోగులున్నారు అనే విషయాన్ని అధికారులు బయటకు పొక్కనివ్వడంలేదు. అదేవిధంగా మరోపక్క క్రిమినల్ కేసుల నమోదు, క్రమ శిక్షణ చర్యలతో పాటు వారి రెండు రోజుల వేతనాన్ని కట్ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. విధులకు హాజరుకాని వారిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు చేసిన అధికారులపై కూడా ఇలాంటి చర్యలుంటాయని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. అలాగే విధులకు హాజరుకాని ఉద్యోగులు తమపై ఎలాంటి ప్రభావం పడకుండా అధికార పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో జిల్లా ఉన్నతాధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో డీలా పడుతున్నారు. ఎన్నికల కమిషనర్‌తో జోకులొద్దు అంటూ అధికారులు నేతల మాట వినకుండా తమ పని చేసుకుపోయినట్లు సమాచారం. మొన్నటి వరకు గైర్హాజరైనా ఉద్యోగులను ముట్టుకుంటే ఊరుకోమ ని అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగ సంఘాలు కూడా చల్లబడ్డాయి