
పరీక్షలకు హాజరైన అభ్యర్థులు(ఫైల్)
లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ కొలువుల రాత పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు నెలవు కానున్న నేపథ్యంలో జిల్లాలో కొలువుల కోలాహలం నెలకొంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు ఇంటి ముంగిటకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నవరత్నాల అమలుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు చేరేందుకు ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
నెల్లూరు(అర్బన్): జిల్లాలో 940 పంచాయతీలకు 665 సచివాలయ భవనాలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 10,300 కొత్త కొలువులు రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి పారదర్శకంగా ఈ నెల 1 నుంచి 8వ వరకు కేవలం మెరిట్ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించారు. ఇందుకు 1,29,860 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,17,138 మంది పరీక్షలు రాశారు. 19 రకాల పోస్టులను భర్తీ చేసేందుకు 14 రకాల పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. పరీక్షల ఓఎంఆర్ షీట్లను 3వ తేదీ నుంచి మొదలు పెట్టి 9వ తేదీ వరకు రికార్డు స్థాయిలో స్కానింగ్ చేశారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా ఫలితాలను గురువారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
జిల్లా టాపర్లు వీరే..
హాల్ టికెట్ నంబరు | పేరు | మార్కులు | పోస్టుపేరు |
190904003189 | పొట్టేళ్ల సురేష్ | 114.75 | కేటగిరీ–2 గ్రూప్ ఏ |
190905004464 | సున్నపు రవి | 114.25 | కేటగిరీ–2 గ్రూపు–బీ |
190905004012 | బెల్లం సాంబశివరెడ్డి | 113.25 | కేటగిరీ–2 గ్రూపు–బీ |
190904003218 | కుడుమల సందీప్ | 110.5 | కేటగిరీ–2 గ్రూపు–ఏ |
190905000617 | పప్పిశెట్టి నిఖిల్ | 110 | కేటగిరీ–2 గ్రూపు–బీ |
190904005553 | కండే మాధురి | 106.5 | కేటగిరీ–2 గ్రూపు–ఏ |
190901060478 | బి. లక్ష్మీమౌనిక | 101.75 | కేటగిరీ–1 |
191005001773 | బొమ్మన పూజిత | 100.75 | కేటగిరీ–2 గ్రూపు–బీ |
191301043962 | గాజులపల్లి శ్రీలేఖ | 100 | కేటగిరీ–1 |
191004002956 | ఎస్.విజయలక్ష్మి | 99.75 | కేటగిరీ–2 గ్రూపు– ఏ |
శరవేగంగా నియామకాల ప్రక్రియ
పరీక్ష ఫలితాలను గ్రామ సచివాలయం/ఆర్‌టీజీఎస్ వెబ్ సైట్‌లో అభ్యర్థి హాల్ టికెట్లు నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా తెలుసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. తర్వాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలిపిన తేదీల్లో నిర్ణీత ప్రదేశాల్లో వారి సర్టిఫికెట్‌లను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో ఈ నెల 21వ తేదీ నుంచి అప్‌లోడ్ చేయాలి. 21వ తేదీ, 22వ తేదీల్లో అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపిణీ చేస్తారు. సర్టిఫికెట్స్ పరిశీలన అనంతరం 27వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment