పింఛన్ సొమ్మును పోతమ్మకు అందజేస్తున్న దృశ్యం, నాటుపడవలో ప్రయాణిస్తున్న వలంటీర్ సింహాచలం
దేవరాపల్లి(మాడుగుల): లబ్ధిదారుల చెంతకు పథకాలు అందించేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం అక్షరాలా నెరవేరుతోంది. ఒక్క వృద్ధురాలికి పింఛన్ ఇచ్చేందుకు వ్యయప్రయాసలకోర్చి నాటుపడవలో ఏరుదాటి అతికష్టం మీద గ్రామానికి చేరుకుని తన అంకితభావాన్ని చాటుకున్నాడు ఓ వలంటీర్.
దేవరాపల్లి మండలం తామరబ్బ పంచాయతీ పరిధిలోని లోవ ముకుందపురం గ్రామంలో ఏటికి అవతలి వైపు వృద్ధురాలు వంతె పోతమ్మకు చెందిన ఒక్క కుటుంబం నివసిస్తోంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే గుట్టలు, కొండల్లో ఏడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాలి. లేదంటే నాటుపడవలో ఏరును దాటి.. మూడు కిలోమీటర్లు నడవాలి. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో స్థానిక వలంటీర్ టేడ సింహాచలం నాటు పడవలో ప్రయాణించి అతికష్టం మీద గ్రామానికి చేరుకున్నారు. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ సొమ్మును అందజేశారు.
పింఛన్ సొమ్మును ఇంటికి తీసుకొచ్చిన వలంటీర్‌ను పోతమ్మ కుటుంబ సభ్యులు అభినందించారు. గతంలో పింఛన్ అందుకోవాలంటే చాలా కష్టాలు పడాల్సివచ్చేదని గుర్తుచేసుకుంది పోతమ్మ. పథకాల్ని ఇంటికి చేర్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనతో తమకు బాధలు తప్పాయని ఆనందం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment