ఇక గ్రామ వలంటీర్లకు శిక్షణప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15 నుంచి అమలకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలో 14, 449 మంది గ్రామ వలంటీర్ల ఎంపికప్రక్రియ పూర్తయింది. కొత్తగా విధుల్లో చేరే గ్రామ వలంటీర్లకు విధి, విధానాలపై శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు.
సాక్షి, ఒంగోలు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్నా గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలుకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలో 14,449 మంది గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మండలస్థాయి ఎంపీడీఓల ద్వారా ఇటీవల నియామక పత్రాలను కూడా అందించారు. కొత్తగా విధుల్లో చేరే గ్రామ వలంటీర్లకు విధి, విధానాలపై శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఈ నెల 6వ తేది నుంచి 9వ తేది వరకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. జిల్లాలో ఉన్న 56 మండలాల్లో శిక్షణ పొందిన ఎంపీడీఓల ద్వారా గ్రామ వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత జిల్లా నుంచి 10 మంది ఎంపీడీఓలు, 10 మంది ఈఓపీఆర్‌డీలను ఎంపిక చేసి ఇటీవల గుంటూరు జిల్లా బాపట్లకు జిల్లా కలెక్టర్ శిక్షణకు పంపించారు. రెండు రోజుల పాటు శిక్షణ పొందిన ట్రైనర్స్ శనివారం, ఆదివారం రెండు రోజులలో జిల్లాలో ఉన్న 56 మంది ఎంపీడీఓలకు శిక్షణనిచ్చారు.
తొలిరోజు 28 మంది, రెండో రోజు 28 మందికి శిక్షణలో పాల్గొన్నారు. మొత్తం 56 మంది ఎంపీడీఓలు శిక్షణ పొందారు. వీరంతా ఈ నెల 6 నుంచి మండల స్థాయిలో ఆయా మండలాల్లో గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారికి మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కొక్క బ్యాచ్‌కి 50 మందిని ఎంపిక చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ వలంటీర్లు విధుల్లో చేరిన దగ్గర నుంచి ఏయే పనులు నిర్వహించాలో ఈ శిక్షణలో అవగాహన కల్పించనున్నారు. శిక్షణలో ఒక్కొక్క గ్రామ వలంటీర్‌కు ప్రభుత్వం ముద్రించిన కరదీపిక, ఒక పెన్ను సరఫరా చేస్తారు. కొన్ని మండలాల్లో ఎక్కువ మంది వలంటీర్లు ఉంటే మరో రెండు రోజులు శిక్షణ పొడిగించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ వెసులుబాటు కల్పించినట్లు ఇన్‌చార్జి డీపీఓ పీవీ నారాయణ తెలిపారు.
నేడు మండలస్థాయి అధికారులతో సమావేశం
గ్రామ వలంటీర్ల శిక్షణకు సంబంధించి సోమవారం మండల స్థాయి అధికారులతో మండల కేంద్రంలోనే ఎంపీడీఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి డీపీఓ పీవీ నారాయణ తెలిపారు. శిక్షణలో ఎవరెవరు, ఏయే సబ్జెక్టుపై శిక్షణ ఇవ్వాలని అనే అంశంపై సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపారు.
శిక్షణకు నిధులు మంజూరు
గ్రామ వలంటీర్లకు శిక్షణా సమయంలో కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయనున్నారు. వీటికి అయ్యే ఖర్చుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోందని ఇన్‌చార్జి డీపీఓ తెలిపారు. ఒక్కొక్క మండలానికి రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఆగస్టు 15 నుంచి విధులకు హాజరు
శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామ వలంటీర్లు తరువాత గ్రామస్థాయిలో ఆగస్టు 15 నుంచి విధులకు హాజరుకానున్నారు. శిక్షణలో పొందిన అంశాల ఆధారంగా గ్రామస్థాయిలో తమకు అప్పగించిన 50 ఇళ్లపై పర్యవేక్షణ చేసే కార్యక్రమం ప్రారంభమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment