మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: క్రిస్‌మస్‌ను పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంతో పాటు ప్రసిద్ధ ప్రార్థన మందిరాలు ఉన్న కావేరమ్మ పేట, జడ్చర్ల, ఫాతిమానగర్, లూర్ధునగర్, శాంతి నగర్, వెలగొండ కాలనీ, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, గద్వాల, అలంపూర్, అయిజ, క్రిస్టియన్‌పల్లి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు చర్చీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించారు.
అంతకుముందు వారం రోజులుగా పలు చోట్లు ధార్మిక ప్రసంగాలు నిర్వహించారు. ప్రత్యేకప్రార్థనల అనంతరం అన్ని మతాల వారు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం, రోగులకు పండుపంపిణీచేశారు. జిల్లా కేంద్రంలోని కల్వరి మెన్నోనైట్ బ్రదరన్ చర్చ్‌లో క్రిస్‌మస్ వేడుకలు రంగరంగవైభవంగా జరిగాయి. చర్జి అభివృద్ధి సంఘం అధ్యక్షుడు, పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
మంత్రి డీకే అరుణ గద్వాలలో జరిగిన క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన నేటివ్ సంస్థ ఫౌండర్, డెరైక్టర్ డాక్టర్ ఎడ్గర్ సాయలూరి ముఖ్య ప్రసంగీకుడిగా హాజరై ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజేసీ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు క్రీస్తుమార్గంలో నడవాలని కాంక్షించారు.
ఆయన మాదిరి సమభావంతో అందరిపై ప్రేమ, ఆప్యాయత చూపాలని కోరారు. ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ ఎడ్మకిష్టారెడ్డి మాట్లాడుతూ పరోపకారం, క్షమాగుణం, ప్రేమ, సేవలు చేయడం క్రీస్తు సూచించిన మహోన్నత మార్గాలని అన్నారు. క్రైస్తవ సోదరుల్లో ఇతర మతాల వారిని ఆదరించడమే కాకుండా సేవాభావం కలిగి ఉండే గుణాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ మల్లికార్జున్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్ , పీసీసీ సభ్యుడు బుర్రి వెంకట్‌రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దిరెడ్డి సాయిరెడ్డి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, పట్టణ ప్రముఖులు కేఎస్ రవికుమార్, సయ్యద్ ఇబ్రాహీం, జూపల్లి భాస్కర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.