
వెంకయ్యనాయుడుకు స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, సుజనాచౌదరి
విమానాశ్రయం(గన్నవరం): ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ, ఆత్కూరు పర్యటనల నిమిత్తం న్యూఢిల్లీ నుంచి భారత వాయుసేన విమానంలో ఉదయం 10.10 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు, గడ్కరీకి రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు.
ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, మాగంటి వెంకటేశ్వరరావు, కంభంపాటి హరి బాబు, గోకరాజు గంగరాజు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, డీజీపీ ఎన్.సాంబశివరావు, ప్రొటోకాల్ కార్యదర్శి శ్రీకాంత్, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్, డీసీపీ డాక్టర్ గజరావుభూపాల్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.మధుసూదనరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్ తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పాతటెర్మినల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వాగత శిబిరంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సీఎం, గవర్నర్, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీతో కలిసి ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరివెళ్లారు.
గవర్నర్‌కు స్వాగతం
తొలుత హైదరాబాద్ నుంచి ట్రూజెట్ విమానంలో గవర్నర్ నరసింహన్ గన్నవరం చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ బి. లక్ష్మీకాంతం, డీసీపీ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తదితరులు స్వాగతం పలికారు.