రాజన్నకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్నారు. ఆయన జయంతిని మంగళవారం వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 65వ జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. తిరుపతి తుడా సర్కిల్‌లో వైఎస్ విగ్రహానికి పార్టీ కేంద్రపాలకవర్గ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పూజలు నిర్వహించి, నివాళులర్పించారు. పార్టీ పట్టణశాఖ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మదనపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు దేశాయ్ తిప్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పలువురు పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై వైఎస్‌ఆర్ చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. పుంగనూరులో జరిగిన జయంతి వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్‌పీటీసీ మాజీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ పాల్గొన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయంలో వరుణయాగం జరిపించారు.
వర్షాలు విరివిగా కురిసి వ్యవసాయం అభివృద్ధి చెంది వైఎస్‌ఆర్ ఆశయాలు నెరవేరాలని మొక్కుకున్నారు. పేదలకు అన్నదానం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో కార్యకర్తలు వైఎస్‌ఆర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గంగాధర నెల్లూరు నియోజవర్గంలోని పలు మండ లాల్లో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి పాల్గొన్నారు.
ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో బి కొత్తకోట, మొలకలచెర్వు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి.
చిత్తూరు డీసీసీబీ కార్యాలయం ఆవరణలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అనాథలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యుడు ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనుప్పల్లెలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
కుప్పంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, స్థానిక బధిర పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూజలు చే సి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
బంగారుపాళెం, యాదమరి, త వణంపల్లెల్లో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సునీల్ పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆదిమూలం ఆధ్వర్యంలో కార్యకర్తలు వైఎస్‌ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.