‘తొలి’ వెలుగు | Completed 13 years to the first signature of YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

‘తొలి’ వెలుగు

Published Mon, May 15 2017 1:01 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

‘తొలి’ వెలుగు - Sakshi

‘తొలి’ వెలుగు

ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలి సంతకానికి 13 ఏళ్లు పూర్తి
- సాగుకు ఉచిత విద్యుత్, విద్యుత్‌ బకాయిలు మాఫీ
- దశాబ్దం దాటినా జనం మదిలో చెక్కుచెదరని చరిత్రాత్మక సంతకం
- ‘ఉచితం’తో ఏపీ, తెలంగాణలో 43 లక్షల మంది రైతులకు లబ్ధి


‘తొలి సంతకం’ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సంతకమే. విద్యుత్‌ బిల్లుల భారంతో వెన్ను విరుగుతున్న రైతన్నకు ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తూ ప్రజల సాక్షిగా మహానేత చేసిన చరిత్రాత్మక సంతకానికి 13 ఏళ్లు నిండాయి. సంతకం చేసి దశాబ్దం దాటినా జనం మదిలో ని ఆ జ్ఞాపకం చెక్కుచెదరలేదు. ఉచిత విద్యుత్‌ తో రైతన్న పచ్చగా ఉండాలని రాజన్న సంక ల్పించారు. ఆ సంకల్పం గొప్పది కాబట్టే ఉమ్మ డి రాష్ట్రంలో ప్రారంభమైన ఉచిత విద్యుత్‌ పథకం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ నిర్వి ఘ్నంగా సాగుతోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి కాంగ్రెస్‌ అధిష్టానం ఒప్పుకోకపోయినా వైఎస్‌ ఒప్పించారు.
– సాక్షి, అమరావతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 మే 14వ తేదీన హైదరాబాద్‌ లాల్‌బహదూర్‌ స్టేడియంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ఫైల్‌పై తొలి సంతకం పెట్టారు. దీంతోపాటు 2004 మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో రైతుల విద్యుత్‌ చార్జీల బకాయిలు రూ.1,259 కోట్లను మాఫీ చేస్తూ మరో సంతకం పెట్టారు. అన్నదాతలకు విద్యుత్‌ చార్జీల భారం నుంచి విముక్తి కలిగించారు. సాగుకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చి బతుకుపై భరోసా కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ పాలనలో 2009 నాటికి 30 లక్షల మంది రైతులు ఉచిత్‌ విద్యుత్‌తో ప్రయోజనం పొందారు. ప్రస్తుతం 13 జిల్లాల ఏపీలో 16 లక్షలు, తెలంగాణలో 27 లక్షల మంది అన్నదాతలు ఉచిత్‌ విద్యుత్‌ను పొందుతు న్నారు. అంటే వైఎస్‌ కృషితో 43 లక్షల మంది రైతులకు కరెంటు ఉచితంగా అందుతోంది.

బాబు హయాంలో రైతులపై రాక్షసత్వం
2004 మే నెల ముందువరకు తొమ్మిదేళ్ల చంద్ర బాబు  పాలనలో రైతులు అన్ని విధాలా చితికి పోయారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా సక్రమంగా లేక, విద్యుత్‌ చార్జీల భారం భరించలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకు న్నారు. అయినా చంద్రబాబు రైతుల పట్ల రాక్షసంగా వ్యవహరించారు. విద్యుత్‌ చార్జీల ను చెల్లించని రైతుల మోటార్లు, స్టార్టర్లను నిర్దాక్షిణ్యంగా లాక్కుపోయారు. అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులను జైళ్లలో పెట్టారు. విద్యుత్‌ చార్జీలను తగ్గించాలంటూ ఆందోళన చేసిన వారిపై హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించారు. అన్నదాతల ప్రాణాలను బలితీ సుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబు పాలనలో రైతులు జీవచ్ఛవాలుగా మారారు. ఈ దుస్థితిని చూసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తల్లడిల్లిపోయారు. తాము అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామని, రైతుల విద్యుత్‌ చార్జీల బకాయిల న్నీ బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేశారు. హామీని అమలు చేసి చూపించారు.  రైతుల గుండెల్లో నిలిచిపోయారు.

‘ఉచితం’తో అదనంగా 70 లక్షల ఎకరాలు సాగు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌తోపాటు రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారు. విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని రైతుపై చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి పెట్టిన 1.10 లక్షల విద్యుత్‌ చౌర్యం కేసులను వైఎస్‌ ఎత్తివేశారు. వ్యవసాయ విద్యుత్‌కు అప్పటివరకూ ఉన్న రూ.2 వేల కోట్ల సబ్సిడీని రూ.7 వేల కోట్లకు పెంచారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి లేకున్నా, బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు మండిపోతున్నా రైతన్న కోసం కొనుగోలు చేయడానికి ఏనాడూ వెనుకడుగు వేయలేదు.

వైఎస్‌ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 124 మిలియన్‌ యూనిట్లు మాత్రమే. వైఎస్‌ పాలనలో సాగుకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం వల్ల వినియోగం రోజుకు 195 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. 2004 నాటికి 23.5 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, 2009 నాటికి 26.5 లక్షలు దాటాయి. అనధికారంగా మరో 3.5 లక్షలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరు తత్కాల్‌ కింద ఉచిత విద్యుత్‌ వినియోగించుకోవచ్చని వైఎస్‌ ప్రభుత్వం భరోసానిచ్చింది. ఉచిత విద్యుత్‌ కారణంగా బోర్లు, బావుల కింద అదనంగా 70 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి.

చంద్రబాబు ఐదు సంతకాలు
మహానేత వైఎస్‌  చేసిన తొలి సంతకానికి 13 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎంచంద్రబాబు  చేసిన తొలి సంతకాల అమలు తీరును ప్రజలు చర్చించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే రైతు రుణాల మాఫీ, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ, మద్యం బెల్టు దుకాణాల రద్దు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు, ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల ‘ఎన్టీఆర్‌ సుజల’ నీరు అనే ఐదు హామీలను నెరవేరుస్తానంటూ ఐదు సంతకాలు చేశారు.

► చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, వడ్డీకి కూడా సరిపోని విధంగా రుణమాఫీ కింద కేవలం రూ.11,413 కోట్లు విడుదల చేశారు. రుణమాఫీకి లెక్కలేనన్ని షరతులు విధించారు.

► 2014 మార్చి నెలాఖరు నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉండగా, అందులో ఇప్పటిదాకా ఒక్క పైసా రుణాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు నుంచే డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకం అమలు ఉండేది. ఈ పథకానికి టీడీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో డ్వాక్రా మహిళలు వడ్డీ డబ్బులను సైతం వారే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్వాక్రా సంఘాలపై వడ్డీ రూపంలో దాదాపు రూ.1,740 కోట్ల మేర అదనపు భారం పడినట్లు అంచనా.

► చంద్రబాబు సంతకాన్ని వెక్కిరిస్తూ రాష్ట్రంలో మద్యం బెల్టుషాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారికంగా 4,380 మద్యం దుకాణాలుండగా, ఒక్కో దుకాణానికి అనుబంధంగా పది బెల్టుషాపులు  కొనసాగుతున్నాయి. 

► ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ పెంపును వర్తింపజేయలేదు.

► ‘ఎన్టీఆర్‌ సుజల’ పథకాన్ని 2014 అక్టోబరు 2న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. దీనికి నిధులను విడుదల చేయకపోవడంతో సురక్షితమైన తాగునీరు అందడం లేదు.

అమలవుతున్న వైఎస్‌ పథకాలు  
రైతుల రుణాలు మాఫీ, ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్‌లు, విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్‌మెంట్, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, అడిగిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు భూపంపిణీ, జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంటలకు గిట్టుబాటు ధరలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పథకాలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్‌ ప్రవేశపెట్టిన వినూత్నమైన పథకాలను ఇప్పటి ప్రభుత్వాలు కూడా  కొనసాగించక తప్పని పరిస్థితి ఉందంటే ఆయన దార్శనికతను అర్థం చేసుకోవచ్చు.  ఆయా పథకాల పేర్లను మారుస్తున్నప్పటికీ అందులో వైఎస్‌ సంకల్పమే కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement