మాట నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్‌ఆర్
- చంద్రబాబు మోసకారి
- ప్రజల నుంచి గుణపాఠం తప్పదు
- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మాటకు కట్టుబడే వ్యక్తి అని, అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయారని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మండల పర్యటన చివరి రోజు బుధవారం ఆయన పూజగానిపల్లె గ్రా మంలో ప్రసంగించారు. వైఎస్‌ఆర్‌ను మాటకు కట్టుబడే వ్యక్తిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్‌పై సంతకం చేశారని, రూ.35 వేల కోట్ల కరెంటు బకాయిలు మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు.
రాష్ట్రంలో నేటికీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే పేద ప్రజల కోసం చేపట్టిన పక్కాగృహాలు, పెన్షన్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్లు, పావలావడ్డీ రుణాలు, 108, 104 పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పడమటి మండలాల్లోని రైతుల కోసం హంద్రీ-నీవా కాలువను ప్రారంభించిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఆయన ప్రారంభించిన కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10 శాతం పనుల కోసం నిధులు కేటాయించేందు కు చంద్రబాబు సుముఖత చూపకపోవడం బాధాకరమన్నారు.
హంద్రీ-నీవా కాలువలో నీరు వస్తే 36 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాంటి పథకాలను వదిలివేసి, చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీపై చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి పుల్లారావు చేస్తున్న పొంతనలేని ప్రకటనలు ప్రజలను మోసగించడమేనన్నారు. టీడీపీలో కబ్జాదారులకు, మోసగాళ్లకు స్థానం కల్పించి, పేద ప్రజలను పీడిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్టీఆర్ పేదల పక్షిపాతిగా ఉంటూ, రెండు రూపాయల బియ్యం, మద్యపానం నిషేధం అమలుపరచి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తికి అల్లుడైన చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి, అక్రమార్గాల్లో సీఎం అయి మూడు నెలల్లోనే మద్యనిషేధాన్ని ఎత్తివేశారని ఆరోపించారు. రెండు రూపాయల బియ్యాని ఐదు రూపాయ లు చేసి పేదలను నిలువుదోపిడి చేసి చరిత్రహీనుడుగా మిగిలిపోయారని అన్నారు.
ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించి, ఆయన చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడేనని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి పరిపాలన చేసే అర్హత లేదన్నారు. త్వరలోనే ప్రజలు చంద్రబాబు కళ్లు తెరిపిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు ద్వారకనాథరెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, జెడ్పీటీసీ వెం కటరెడ్డియాదవ్, ఎంపీపీ నరసింహులు, ఏ ఎంసీ మాజీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ ఎంపిటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.