
మిరియాలకు అంతిమ వీడ్కోలు
కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు పార్ధివదేహానికి అశేష జనవాహిని మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.
విశాఖపట్నం : కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు పార్ధివదేహానికి అశేష జనవాహిని మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో మిరియాల నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. చైతన్యనగర్‌లోని ఆయన నివాసానికి సోమవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున కాపు సామాజికవర్గ నేతలు, అభిమానులు చేరుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌లు మిరియాల వెంకటరావు నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
మిరియాల భార్య ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, కుమార్తె స్వాతిలను పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మిరియాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు మిరియాల నివాసానికి చేరుకుని ఆయన పార్ధివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుమారుడు శేషగిరిబాబుకు పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు, మాణిక్యాలరావు,ఎమ్మెల్సీ చైతన్యరాజు, మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, బాలరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బరాయుడు, జ్యోతుల నెహ్రూ, కరణం ధర్మశ్రీ, కోరాడ రాజబాబు, తోట రాజీవ్, పసుపులేటి ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యే నాని, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పార్టీలకతీతంగా ఎందరో నాయకులు మిరియాలకు నివాళులర్పించారు. మిరియాల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. పలువురు నేతలు మాట్లాడుతూ మిరియాల మరణం రాష్ట్రానికే తీరని లోటన్నారు. కాపు సామాజికవర్గ ఉద్యమ నేతగా ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపారన్నారు.
అంతిమయాత్ర
కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి సంద్రంతో మిరియాల అంతియ యాత్ర సాగింది. చైతన్యనగర్ నుంచి కేఆర్‌ఎం కాలనీ హిందూ శ్మశాన వాటిక వరకు అభిమానులతో ఈ యాత్ర సాగింది. కాపు సామాజికవర్గ పెద్ద దిక్కును కోల్పోయామని ఆ సామాజికవర్గ ప్రజలు విలపించారు. దారి పొడుగున మిరియాల సేవలను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మిరియాల ఇక లేరనే ఆలోచనే తట్టుకోలేకపోతున్నామని కంటతడిపెట్టారు. అశేష జనవాహిని వెంటరాగా కుమారుడు శేషగిరిబాబు తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు.
మిరియాల మృతికి టీఎస్‌ఆర్ ప్రగాఢ సంతాపం
కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు మృతి పట్ల రాజ్యసభ్యుడు టి.సుబ్బిరామిరామిరెడ్డి ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ తదితర సామాజిక వర్గాల అభివృద్ధికి మిరియాల చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన మిరియాల నేతలకు ఆదర్శనీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.