భర్త, కుమారుడితో హేమలత (ఫైల్) ,గ్రూప్–1 విజేత హేమలత
మారుమూల పల్లెటూరు... సాధారణ వ్యవసాయ కుటుంబం... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం... ఇవేవీ ఆమె లక్ష్యానికి అడ్డంకి కాలేదు! స్వయంకృషితో ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే కుటుంబం అండగా నిలిచింది! సివిల్ సర్వీసెస్ తర్వాత అంత అత్యున్నతమైన ఉద్యోగాన్ని సాధించడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి! తొలిసారిగా ఒక గ్రూప్–1 టాపర్‌ను సమాజసేవకు అందించిన కనుగులవానిపేటలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి! ఇంతటి భావోద్వేగాలకు కారణమైన ఆమె పేరు కనుగుల హేమలత! గ్రూప్–1 (2011)లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. మహిళల్లోనే టాపర్‌గా నిలిచింది. సిక్కోలు సిగలో మరో మణిపూసగా మెరిసింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:శ్రీకాకుళం రూరల్ మండలంలో ఇప్పిలి శివారు గ్రామమైన కనుగులవానిపేట ముద్దుబిడ్డే హేమలత! ఆమె తండ్రి ప్రసాదరావు, తల్లి సుజాత. వారిది వ్యవసాయ కుటుంబం. ఆరోగ్యపరమైన కారణాల వల్ల ప్రసాదరావు పాఠశాల స్థాయిలో అర్ధంతరంగా చదువు ముగించాల్సి వచ్చింది. ఆయన సోదరులంతా విద్యాభ్యాసం ద్వారానే మంచి స్థానంలోకి వెళ్లారు. ఉన్నత విద్యాభ్యాసం చేయాలి, సమాజసేవ చేయాలి అనే కలలను తన పిల్లల ద్వారా సాకారం చేయాలని తపించారు. అందుకు తగ్గట్లే హేమలత సహా ముగ్గురు పిల్లలూ గౌరవనీయమైన ఉద్యోగాలు సాధించారు. ప్రసాదరావు పెద్ద కుమార్తె హైమావతి ఆమదాలవలస మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు జగదీశ్వరరావు జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని దేవరకొండలోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు రెండో కుమార్తె హేమలత గ్రూప్–1లో టాపర్‌గా నిలిచారు. ఈ ర్యాంకు డిప్యూటీ కలెక్టరు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సమాజసేవ చేయడానికి, తద్వారా ఉన్నతస్థాయిలో తగిన గుర్తింపు పొందడానికి అవకాశం రావడంతో హేమలత కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ...
కనుగులవానిపేటలో ప్రసాదరావు కుటుంబానికి మూడెకరాల మెట్టు భూమి ఉంది. గతంలో చిన్న రైస్‌మిల్లు కూడా ఉండేది. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో వాటిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబపోషణ చూసేవారు. కానీ ఏదేమైనా బాగా చదువుకోవాలని పిల్లలకు నూరిపోసేవారు. తండ్రి మనస్సును అర్థం చేసుకున్న పిల్లలు ముగ్గురూ కష్టపడి చదివారు. హేమలత ప్రాథమిక విద్యాభ్యాసం కనుగులవానిపేట పాఠశాలలోనే చదివారు. అయితే గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చదువు బాగుంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. దీంతో తండ్రి ప్రోత్సాహంతో హేమలత ఎచ్చెర్లలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో సీటు సాధించింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ అక్కడే విద్యాభ్యాసం సాగింది. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో 2001 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఎంపీసీ సీటు వచ్చింది. అప్పుడే తోటి స్నేహితుల మధ్య సివిల్స్, గ్రూప్–1 గురించి చర్చ వచ్చేదని, సమాజసేవ నేరుగా చేసే అవకాశం ఆ ఉద్యోగాల్లో ఉంటుందనే విషయం తెలిసిందని హేమలత చెప్పారు. కానీ ఇంటర్ తర్వాత ఎంసెట్ ప్రిపరేషన్ ఏడాది చేసినా ఆశించిన ర్యాంకు రాలేదు. అక్క హైమావతి ప్రోత్సాహంతో టీచర్ ట్రైనింగ్ వైపు దృష్టి పెట్టారు. 2002లో శ్రీకాకుళం డైట్‌లో సీటు సాధించారు. 2004లో కోర్సు పూర్తి చేస్తుండగానే డీఎస్సీ–2003 నోటిఫికేషన్ వెలువడింది. ఆ పరీక్షల్లోనూ రాష్ట్రస్థాయిలో మహిళా టాపర్‌గా హేమలత నిలిచారు. 2005లో సెకండ్‌గ్రేడ్ టీచర్ ఉద్యోగం పొందారు. ఎల్‌ఎన్ పేట మండలం బొత్తాడసింగి పాఠశాలలో, తర్వాత 2012 వరకూ ఎచ్చెర్ల మండలంలో పనిచేశారు. ఒకవైపు టీచర్ ఉద్యోగం చేస్తూనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కూడా పూర్తి చేశారు. 2012లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం పార్వతీపురంలో పనిచేస్తున్నారు.
పదేళ్ల పరిశ్రమ ఫలించింది
సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు 2007 సంవత్సరంలోనే హేమలత ప్రిపరేషన్ ప్రారంభించారు. గ్రూప్–1 2007 నోటిఫికేషన్‌లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ దశ వరకూ వెళ్లారు. త్రుటిలో అవకాశం చేజారింది. తర్వాత మరో రెండు నోటిఫికేషన్లలోనూ ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. ఇక ఆఖరి ప్రయత్నంగా 2011 గ్రూప్–1 నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేశారు. 2012లో మెయిన్స్, ఇంటర్వ్యూ ఆమె బాగానే చేశారు. కానీ న్యాయపరమైన వివాదాల వల్ల ఫలితాలు రద్దు చేసినా ఆమె నిరాశపడలేదు. 2016 సెప్టెంబర్‌లో మరోసారి మెయిన్స్ పరీక్షలు, ఇటీవలే నిర్వహించిన ఇంటర్వ్యూలో బాగానే అటెమ్ట్ చేశానని, తప్పక మంచి పోస్టు వస్తుందని ఆశించానని హేమలత చెప్పారు. ఆశించినట్లే రెండో ర్యాంకు, మహిళలలో ప్రథమ ర్యాంకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు.
భర్త నుంచి ప్రోత్సాహం
హేమలత భర్త కె.తవిటినాయుడు ప్రస్తుతం విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ప్రణవ్ ఉన్నాడు. తన విజయంలో తల్లిదండ్రులు, సోదరి, సోదరుడుతో భర్త ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని హేమలత చెప్పారు.
గ్రామీణ ప్రాంతవారమని నిరాశ వద్దు
‘ఉన్నత ఉద్యోగాల సాధనకు గ్రామీణ నేపథ్యం ఏమాత్రం అడ్డంకి కాదు. గ్రామీణ ప్రాంతవారమని అమ్మాయిలకు నిరాశ వద్దు. కష్టపడి, ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అభిరుచిని బట్టి ఏ రంగాన్ని ఎంచుకున్నా లక్ష్యం సాధించేవరకూ విశ్రమించకూడదు.’ – కనుగుల హేమలత, గ్రూప్–1 విజేత
Comments
Please login to add a commentAdd a comment