టేకూరుపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు
బద్వేలు: టేకూరుపేట పోరుమామిళ్ల మండలంలోని ఒక చిన్న గ్రామం. ఆక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలో 2012లో కేవలం 40 మంది విద్యార్థుల పేర్లు నమోదైనా వచ్చేది 28 మందే. అక్కడ ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన వీరయ్య తమ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దీనిపై గ్రామాల్లో విసృత ప్రచారం చేశారు. ఒక్క ఏడాదే దాదాపు 60 వరకు అడ్మిషన్లు రావడంతో 30లోపు ఉన్న విద్యార్థుల సంఖ్య 96కు చేరింది. 2015లో ప్రభుత్వం నుంచి ఆంగ్ల మాధ్యమానికి అనుమతి వచ్చేలోపు ఈ సంఖ్య మరింత పెరిగి 150కి చేరింది. ఇలా ప్రతి ఏటా పెరుగుతూ ప్రస్తుతం 245కు చేరడం విశేషం. 3 వేల జనాభా కూడా లేని ఒక కుగ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 245 మంది విద్యార్థులు ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమంగా విద్య లభించడమేనని గ్రామస్థులు చెబుతున్నారు.
10 గ్రామాల నుంచి విద్యార్థుల రాక..
టేకూరుపేట ప్రాథమిక పాఠశాలలో చుట్టు పక్కల ఉన్న పదిగ్రామాలకు చెందిన పిల్లలు చదువుతున్నారు. కొండుగారిపల్లె, తిరువెంగళాపురం, యర్రశాల, యర్రశాల హరిజనవాడ, టేకూరు, చిన్నకప్పలపల్లె, పెద్దకప్పలపల్లె, తిమ్మారెడ్డిపల్లె, దాసరిపల్లె, కవలకుంట్లలకు చెందిన విద్యార్థులు ఇక్కచ చదువుకుంటున్నారు. తమ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలున్నా ఆంగ్ల మాధ్యమం ఉండటంతోనే టేకూరుపేట పాఠశాలలో పిల్లలను తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు.
♦పోరుమామిళ్లలోని ప్రయివేట్ కాన్వెంట్‌ల్లో చదువుతున్న పైగ్రామాలకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు అక్కడ మానుకుని టేకూరుపేటలో చేరడం విశేషం.
♦ఆయా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రధానోపాధ్యాయుడు వీరయ్య రూ.10 లక్షలు వెచ్చించి వ్యాను కొనుగోలు చేశారు. విద్యార్థుల నుంచి డీజిల్ ఖర్చుకు సరిపోయే విధంగా కొంత నగదు వసూలు చేస్తూ వ్యాను నిర్వహణ చేస్తున్నారు.
♦పోరుమామిళ్ల నుంచి వచ్చే విద్యార్థులకు రూ.300 వ్యాను ఫీజు. అంటే రోజుకు పోను, రానూ రూ.12 వసూలు చేస్తున్నట్లు.
♦పాఠశాలలో చదివే ఇద్దరు ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ఇక్కడే చదివిస్తున్నారు.
♦ప్రభుత్వం 2017లో దీన్ని ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా మార్పు చేసింది.
ప్రత్యేకశ్రద్ధ..
పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వీరయ్యతో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా ప్రత్యేకశ్రద్ధతో విద్యాభోధన చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆంగ్ల మాధ్యమ పుస్తకాలతో పాటు కాపీరైటింగ్ తప్పనిసరిగా నిర్వహిస్తారు.
♦ప్రొగ్రెస్‌కార్డుల్లో విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో చర్చించి వారి మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తారు.
♦యోగాతో పాటు కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
♦ప్రతి రోజూ సాయంత్రం పూట స్టడీఆవర్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల సందేహలు నివృత్తి చేస్తారు.
♦మధ్యాహ్న భోజనంపై ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారు. మోనూలో లేకపోయిన రోజూ రసం కూడా వడ్డించడం విశేషం.
ఆంగ్ల మాధ్యమంతోనే చేరికలు
మా పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తరువాతే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుత కాలంలో చదువు, ఉద్యోగం, ఉన్నతిలో ఆంగ్లం తప్పనిసరిగా మారింది. గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. టేకూరుపేట పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తరువాత 40 మంది ఉన్న విద్యార్థులు 245కు చేరింది. ఉపాధ్యాయులు కూడా చక్కగా బోధిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
– వీరయ్య, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీపాఠశాల, టేకూరుపేట
ప్రయాస తప్పింది
గతంలో ఆంగ్ల మాధ్యమం కావాలంటే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరుమామిళ్లకు పిల్లలను పంపేవాళ్లం. దీంతో పాటు ఫీజులు భారంగా మారేవి. రోజూ ఉదయాన్నే వారిని సిద్ధం చేయడం, పంపడం, వారు వచ్చే వరకు ఆందోళనగా ఎదురు చూడటం జరిగేది. కానీ సమీపంలోనే ఉత్తమవిద్య అందుతోంది. దీంతో ప్రయాస తప్పింది.
– షేక్ మహబూబ్ చాను, టేకూరుపేట
రూ.40 వేలు పైనే ఆదా
ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదవాలంటే ఫీజులు, పుస్తకాలు, స్కూల్ డ్రస్, వ్యాను ఫీజు వంటి వాటికి కనీసం రూ.40వేలు అవసరం. ఇవన్నీ లేకుండా ఇదేస్థాయిలో టేకూరుపేట ప్రాథమిక పాఠశాలలో విద్య లభిస్తున్న నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు ఇక్కడే తమ పిల్లలను చేర్పిస్తున్నారు.
– బోజ్జా ప్రియాంక, టేకూరుపేట
Comments
Please login to add a commentAdd a comment