ఈ–వే బిల్లు తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆర్థిక మంత్రి యనమల, ఎంపీ హరిబాబు, జీఎస్‌టీ ముఖ్య అధికారులు హరేరామ్, శ్యామలరావు తదితరులు
విశాఖసిటీ: దేశంలో పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకే పన్ను.. ఒకే శ్లాబు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయలేమని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జీఎస్‌టీ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా యనమల మాట్లాడుతూ గతంలో వ్యాట్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే మార్కెట్ అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీని 29 రాష్ట్రాలూ వ్యతిరేకించకపోవడం హర్షణీయమన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ వస్తువులకు ట్యాక్స్‌లలో తేడా ఉంటుందన్నారు. ఒకే పన్ను విధానంలో ఒకే శ్లాబ్ పద్ధతి చాలా కష్టతరంతో కూడుకున్నదనీ, దీనికి బ్యాలెన్స్ చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.
మన దేశంలో జీరోతో మొదలై ఐదు శ్లాబులుగా విభజించారన్నారు. ఈ విధానం వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం వాస్తవమన్నారు. శ్లాబుల సంఖ్య తగ్గించే యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్ ఆలోచిస్తోందనీ, ఈ నెల 21న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చర్చకు రానుందని తెలిపారు. వాణిజ్య, వర్తకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జెమ్‌టెడ్ గూడ్స్‌ను జీఎస్‌టీ నుంచి తప్పించాలన్నారు. ప్రస్తుతం చక్కెర పరి శ్రమ ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో దానిపై సెస్ వెయ్యొద్దంటూ జీఎస్‌టీ కౌన్సిల్‌లో ప్రతిపాదించా మని వెల్లడించారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనీ, వాటన్నింటినీ శతశాతం పరిష్కరిస్తే జీఎస్‌టీ 100 శాతం ఉత్తమ ఫలితాలు రాబడుతుందన్నారు.
కొన్ని వస్తువులపై పన్ను రేటు తగ్గింపు?
ఎంపీ హరిబాబు మాట్లాడుతూ గతంలో అమల్లో ఉండే విధానాలతో వినియోగదారుల నుంచి వసూలు చేసిన పన్నుల్ని ప్రభుత్వాలకు చేరకుండా కొంతమంది వ్యాపారులు వ్యవహరించేవారనీ, జీఎస్‌టీ వచ్చిన తర్వాత వారి దారులు మూసుకుపోవడం వల్లే వ్యతిరేకతను వ్యక్తం చేశారన్నారు. 17 రకాల పన్నులు, 23 రకాల సెస్సులను ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై పన్ను రేటును తగ్గించే యోచనలో ఉన్నట్లు హరిబాబు వెల్లడించారు. అదే విధంగా రిటర్న్స్ సరళీకృతం చేసేందుకు త్వరలో జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం వెలువడనుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment