సాక్షి, పశ్చిమ గోదావరి: జీవనోపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఎందరో దళారుల వలలో చిక్కి అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబానికి ఆసరా కోసం వెళ్లిన వారిని తిండి తిప్పలు లేకుండా చేసి గదిలో బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు. ఇలా దుబాయ్ వెళ్లి అక్కడి విదేశీ రాయబార అధికారుల సహాయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్వగ్రామం తిరిగి వచ్చింది ఓ మహిళ. తనలాంటి బాధితులు పదుల సంఖ్యలో అక్కడ ఉన్నారని వారిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాపాడాలని ఆమె కోరుతోంది. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మొగల్తూరుకి చెందిన చెందిన పులిదిండి నాగలక్ష్మిది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. భర్త సురేష్ పొక్లయిన్ డ్రైవర్‌గా చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
వీరి కుటుంబం రెండేళ్ల కిత్రం మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి రాగా రెండు నెలల క్రితం మొగల్తూరుకు మకాం మార్చారు. నాగలక్ష్మికి నర్సుగా చేసిన అనుభవం ఉండటంతో దుబాయ్ వెళ్లే ఆలోచన చేశారు. ఈనేపథ్యంలో ఇరగవరం మండలం ఓగిడి గ్రామానికి చెందిన దొండి వెంకట సుబ్బారావు (చినబాబు) పరి చయం కావడంతో దుబాయ్ పంపేందుకు రూ.లక్ష ఖర్చువుతుందనడంతో అంగీకరించి అతడికి గత నెలలో సొమ్ములు ఇచ్చారు. గత నెల 13న నాగలక్ష్మిని హైదరాబాద్ తీసుకువెళ్లి విమానం ఎక్కించి దుబాయ్‌లో ఆకుమర్తి జ్యోతి అనే మహిళను కలవమని సుబ్బారావు సూచించాడు. 14న దుబాయ్‌లో విమానం దిగిన తర్వాత నాగలక్ష్మిని జ్యోతి జుల్ఫా అనే ప్రాంతానికి తీసుకువెళ్లింది.
అక్కడి నుంచే నాగలక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి. అక్కడ వారు ఆమె పాస్‌పోర్టు తీసుకుని తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులు పెట్టారు. అక్కడ తనతో పాటు మన రాష్ట్రానికి చెందిన వారు మరో పది మంది, కేరళ, చెన్నై, మహారాష్ట్రకు చెందిన వారు కూడా ఉన్నారని నాగలక్ష్మి చెప్పింది. మనిషి అందంగా ఉండి వారికి నచ్చితేనే నర్సుగా ఉద్యోగం ఇప్పిస్తారని, లేకపోతే వ్యభిచార కూపాలకు అమ్మేస్తారని నాగలక్ష్మి వాపోయింది. వ్యభిచారం చేసేందుకు ఒప్పుకోకపోతే దారుణంగా హింసిస్తారని అంటోంది.
15 రోజులపాటు ఎంబసీలోనే..
తాను ఇన్ని బాధలు అనుభవించి భర్తకు ఫోన్‌లో విషయం చెప్పానని.. స్వదేశానికి వచ్చేందుకు సంబంధిత ఏజెంట్ మరో రూ.50 వేలు డిమాండ్ చేశాడని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తన భర్త అప్పులు చేసి మరీ రూ.50 వేలు ఏజెంట్‌కు ఇచ్చాడని, అయినా తనను స్వదేశానికి రప్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంది. తాను విషయాన్ని భర్తకు తెలియజేశానని దుబాయ్‌లో ఉన్నవారికి తెలిసి తనను మరిన్ని ఇబ్బందులు పెట్టారని కన్నీటి పర్యంతమైంది. ఈక్రమంలో గతనెల 27న మరో మహిళతో కలిసి స్థానికంగా ఉన్న వారి సహకారంతో దుబా య్‌లోని భారత ఎంబసీకి చేరుకుని విషయాన్ని వివరించామని, అక్కడి అధికారులు వెంటనే స్పందించి 15 రోజులపాటు తమకు అక్కడ ఆశ్రయం కల్పించారని నాగలక్ష్మి చెప్పింది. ఈనెల 10వ తేదీన పాస్‌పోర్టు ఇచ్చి ఖర్చుల కోసం నగదు ఇచ్చి తనను స్వదేశానికి పంపించారంది. తనతో మరో మహిళ స్వదేశానికి రాగా ఎంబసీలో మరో పది మంది మహిళలు ఉన్నారని, భాష రాకపోవడం, టూరిస్ట్ వీసాతో అక్కడకు వెళ్లడం, దళారుల చేతిలో చిక్కుకోవడం వంటి కారణాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వాపోయింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గల్ఫ్ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించి రక్షించాలని, మోసపూరిత ఏజెంట్లను శిక్షించాలని నాగలక్ష్మి కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment