ఉపాధి వేటలో ఎడారి దేశాల బాటపడుతున్న నిరుద్యోగ యువత కొందరు నకిలీ ఏజంట్ల చేతుల్లో మోసపోయి నష్టపోతుంటే.. మరికొందరు జీతాలు సరిగా రాక.. అప్పులు తీరక.. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేవారికి స్కిల్ డెవలప్‌మెంట్ లేకపోవడంతో ఎక్కువ శాతం కూలీ పనులే చేస్తున్నారని అన్నారు. గల్ఫ్ బాధితుల పక్షాన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా పోరాటాలు చేస్తున్న నర్సింహనాయుడు తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – ఆర్మూర్
ఆర్మూర్: గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, ఇజ్రాయిల్, సింగపూర్ తదితర దేశాలకు తెలంగాణ నుంచి యువత ఉపాధి కోసం వెళ్తున్నారు. కానీ నిరక్ష్యరాస్యులు, శిక్షణ లేనివారు కావడంతో 90 శాతం మంది కూలీలుగానే వెళ్తున్నారు. కేరళ రాష్ట్రీయులు మాత్రం స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణలు పూర్తి చేసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లడంతో మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మనవారికి సరైన శిక్షణ లేక పనులు సరిగా దొరకడం లేదు. దీంతో చేసిన అప్పులు తీరక స్వదేశానికి వచ్చిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని మృతదేహాలను స్వదేశాలకు తరలించడానికి నెలల తరబడి ఎదురు చూసే దయనీయ స్థితిని చూశాము.
2013లో ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదికను ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ప్రతి నెల 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాము. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారాన్ని అందజేసేవారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పరిహారా న్ని ఐదు లక్షల రూపా యలకు పెంచు తామని ఎన్నికల సమయంలో ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదు. అంతే కాదు.. గత ప్రభుత్వాలు ఇచ్చిన తరహాలో లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2 జూన్ 2014 నుంచి 2 అక్టోబర్ 2017 నాటికి 431 మంది తెలంగాణ ప్రజలు గల్ఫ్‌లో మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ధృవీకరించిం ది. వీరిలో ఒక్క కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయమూ అందజేయలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని మృతదేహాలను వెంటనే స్వగ్రామాలకు చేర్చుతున్నప్పటికీ వారి కుటుంబాలకు భరోసా కల్పించడంలో విఫలమవుతున్నారు.
ప్రత్యేక విధానం లేదు..
గల్ఫ్ దేశాల్లో సంక్షోభం గురించి తెలియక ఉపాధి వేటలో ఏడారి దేశాలకు వెళ్లి కష్టాలపాలవుతున్న రాష్ట్ర నిరుద్యోగులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకౖ విధానమంటూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం, ప్రతి ఏటా వంద కోట్ల రూపాయల నిధిని కేటాయించడం లాంటి చర్యలు తీసుకోవాలి. నకిలీ ఏజంట్లను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రత్యేక వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే విదేశాల్లో ఉద్యోగావకాశాలను తెలియప రచాలి. యువతకు అందుకు తగ్గ శిక్షణ ఇచ్చి ఉపాధి కోసం విదేశాలకు పంపే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం, ఉద్యోగపరంగా సమస్యలతో నష్టపోయి తిరిగి స్వదేశానికి వచ్చిన వారికి పావలా వడ్డీతో రుణాలు అందజేసి స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించి వారి జీవితాలకు భరోసా కల్పించాలి. గల్ఫ్ దేశాలలో సంపాదించి తెలంగాణ రాష్ట్రానికి మన వాళ్లు ప్రతీ నెల పంపిస్తున్న డబ్బుపై పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. గల్ఫ్ మృతులు కుటుంబాలకు పింఛన్‌ను అందజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment