చినబాబు అరెస్ట్‌, జ్యోతికి బ్లూ కార్నర్‌ నోటీస్‌! | Gulf Agent Chinababu Arrested In West Godavari District | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌కు మహిళలను పంపుతున్న ఏజెంట్‌ అరెస్ట్‌

Published Sun, Aug 18 2019 3:57 PM | Last Updated on Sun, Aug 18 2019 7:56 PM

Gulf Agent Chinababu Arrested In West Godavari District - Sakshi

సాక్షి, అమరావతి: విజిటింగ్‌ వీసాలతో మోసం చేస్తున్న ఏజెంట్ల ఏరివేతకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా మహిళలను అక్రమంగా విదేశాలకు పంపుతున్న ఏజెంట్‌ చినబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు.  రెండు రోజుల క్రితం ‘జగనన్నా.. మమ్మల్ని కాపాడన్నా’ అని బోరున విలపిస్తూ పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు మహిళలు దుబాయ్‌ నుంచి వీడియో క్లిప్పింగ్‌ పంపిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ మీడియా దృష్టికి వచ‍్చిన ఆ వీడియోను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు పంపించగా.. స్పందించిన ఆయన అలాంటి ఏజెంట్ల ఏరివేత బాధ్యతలను సీఐడీ విభాగానికి అప్పగించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 

వీడియోలో.....‘తమను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రధాన ఏజెంట్‌ జ్యోతి, మరో ఏజెంట్‌ దొండ వెంకట సుబ్బారావు (చినబాబు) ఎవరికో అమ్మేశారని బాధిత మహిళలు’  ఆరోపించడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఏజెంట్‌ చినబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి నుంచి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే జ్యోతి అనే ప్రధాన ఏజెంట్‌ దుబాయ్‌లో కార్యాలయాన్ని నడుపుతున్నట్టు తెలిసింది. ఆమెను ఇండియాకు రప్పించేందుకు బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేయనున్నారు. దుబాయ్‌లో బాధిత మహిళలు ఎవరైనా ఉంటే రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మొగల్తూరుకు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో ఒక ఏజెంట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

చదవండిఎడారి దేశంలో తడారిన బతుకులు     

ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ  నవదీప్‌ సింగ్‌ గ్రేవల్‌ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో కొంతమంది మహిళలు..  ఏజెంట్ల మోసంతో తాము దుబాయ్‌లో చిక్కు​కుపోయామని, కాపాడాలంటూ పంపిన వీడియో వైరల్‌ అయిందన్నారు. పాలకొల్లుకు చెందిన చినబాబు మహిళలను ఎంపిక చేసి గల్ఫ్‌ దేశాలకు పంపుతున్నట్లు చెప్పారు. లైసెన్స్‌ లేకుండా జిల్లాలోని కొందరు ఏజెంట్లు గల్ఫ్‌ దేశాలకు పంపుతున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ‍్చరించారు. నాగలక్ష్మి అనే మహిళ వద్ద నుంచి లక్ష రూపాయలు తీసుకుని, ఆమెను టూరిస్ట్‌ వీసాపై నర్సు ఉద్యోగానికి దుబాయ్‌ పంపాడని, ఆమెతో పాటు మరో అయిదుగురు మహిళా బాధితులు ఇండియన్‌ ఎంబసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ అక్రమ రవాణాపై జిల్లాలో రెండు, రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇక దుబాయ్‌లో ఉండే జ్యోతి అనే మహిళ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలను దుబాయ్‌లో రిసీవ్‌ చేసుకుంటుందని తెలిపారు. 

ఎస్పీలను అప్రమత్తం చేశాం 
బాధిత మహిళల వీడియో క్లిప్పింగ్‌ను అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించాం. మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లతోపాటు మహిళలు, బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్‌ చేయాలని ఆదేశించాం. మహిళలు తమ సమస్యలను 112, 181, 100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వొచ్చు. వాట్సాప్‌ నంబర్‌ 91212 11100కు సమాచారం ఇచ్చినా సహాయం అందుతుంది. -గౌతమ్‌ సవాంగ్, డీజీపీ  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement