ఎడారి దేశాల్లో ఆవిరి అవుతున్న కన్నీళ్లు | Womens Facing Problems In Gulf Countries West Godavari | Sakshi
Sakshi News home page

ఎడారి దేశాల్లో ఆవిరి అవుతున్న కన్నీళ్లు

Published Sun, Aug 25 2019 9:14 AM | Last Updated on Sun, Aug 25 2019 9:18 AM

Womens Facing Problems In Gulf Countries West Godavari - Sakshi

తణుకు పట్టణానికి చెందిన లింగాల బేబి మూడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్లింది. ఇరగవరం మండలం ఓగిడి గ్రామానికి చెందిన చిన్నబాబు, పాలకొల్లుకు చెందిన జ్యోతి ద్వారా విదేశాలకు వెళ్లింది. అక్కడ ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పిన వీళ్లు అక్కడ ఎలాంటి ఉపాధి కల్పించకపోగా కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకూ అవకాశం కల్పించడం లేదు. ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నా.. దుబాయిలో ఏజెంటుగా వ్యవహరిస్తున్న జ్యోతి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

మొగల్తూరుకు చెందిన పులిదిండి నాగలక్ష్మి గతంలో నర్సుగా పనిచేశారు. దుబాయి వెళ్లాలనే ఆశతో ఇరగవరానికి చెందిన దొండి వెంకట సుబ్బారావు (చినబాబు)ను సంప్రదించారు. అతను రూ.లక్ష తీసుకుని దుబాయి పంపాడు. అక్కడికి వెళ్లాక ఆమె వద్ద పాస్‌పోర్టు తీసేసుకుని తిండిపెట్టకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె మరికొందరితో కలిసి భారత ఎంబసీకి చేరుకున్నారు. అక్కడి నుంచి వాట్సాప్‌లో పోస్టు పెట్టడం, అది మొత్తం సర్క్యులేట్‌ అవ్వడంతో విషయాన్ని ‘సాక్షి’ డీజీపీ దృష్టికి తీసుకువెళ్లింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు పోలీసుశాఖ కృషి చేసింది. నాగలక్ష్మి క్షేమంగా సొంతఊరు చేరారు.

సాక్షి, ఏలూరు :  గల్ఫ్‌ అంటే అంతా కాసుల గలగల అనుకుంటారు. ఓసారి వెళ్లొస్తే సెటిలైపోవచ్చని, ఎడారి దేశానికి  వెళ్లి నాలుగు రాళ్లు సంపాదిస్తే కుటుంబం బాగుపడుతుందని ఆశపడటమే వారికి తిప్పలు తెచ్చిపెడుతోంది. సొంత ఊళ్లో పనుల ద్వారా వచ్చే ఆదాయం చాలక, వ్యవసాయం కలిసి రాక.. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా పేరుకుపోతున్న అప్పులు తీర్చుకునేందుకు కష్టమైనా, నష్టమైనా అంటూ చాలామంది గల్ఫ్‌ దేశాల బాట పడుతున్నారు. వర్కింగ్‌ వీసాకు బదులుగా  టూరిస్ట్‌ వీసాపై విదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోతున్నారు. ఆదిలోనే ఏజెంటు చేతిలో మోసపోతే.. వెళ్లాక చెప్పిన పనికి కుదరకపోతే.. పని చేసినా చేతికి చిల్లిగవ్వ ఇవ్వనని సేఠ్‌ మొండికేస్తే ఎడారిలో ఒంటెల మధ్య జీవితం తెల్లారిపోతోంది.  జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకూ గల్ఫ్‌ మోసాలపై 132 కేసులకుపైగానే నమోదు అయ్యాయి. జిల్లాలో 102 మంది వరకూ బోగస్‌ ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 

అడుగడుగునా మోసాలే
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన ఎందరో జీవితాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. లక్షలు వెచ్చించి ఏజెంట్ల మోసాలకు గురై మధ్యలోనే ఆగిపోయేవారు కూడా ఉన్నారు. పాలకోడేరుకు చెందిన యేసురత్నం కుమారుడిని గల్ఫ్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణాజిల్లాకు చెందిన ఏజెంట్‌ మైలాబత్తుల రాంబాబు యేసురత్నం కొడుకును దుబాయి పంపుతానని చెప్పి రూ.80 వేలు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ పంపలేదు. ఇదిలా ఉంటే ఇంటర్వ్యూల పేరుతో ఏజెంట్లు చెప్పే మాయమాటలు నమ్మి ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడేవారు కూడా లేకపోలేదు. కొందరు మహిళలకు గల్ఫ్‌ తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి ఏజెంట్లు లొంగదీసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

దేశంకాని దేశంలో రోదన  
జిల్లా నుంచి ఉపాధి కోసం వేలాది మంది కువైట్, మస్కట్, సౌదీ అరేబియా, బెహ్రాన్, దుబాయి, మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. ఏజెంట్ల మోసాలకు బలై పనుల్లేక చేయని నేరానికి జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య వందల్లోనే ఉందంటే పరిస్థితి అర్థమవుతోంది. ఇతర దేశాలకు వెళ్లి మత్యువాత పడిన వారి సంఖ్య జిల్లాలో 150మందికి పైగానే ఉంది. కువైట్, సౌదీ, ఒమన్, ఖతార్‌ వంటి దేశాల్లో పనివాళ్లను, కార్మికులను సప్లయి చేసే కార్యాలయాలు ఉంటాయి. అక్కడి ఏజెంట్లు ఇక్కడి ఏజెంట్ల ద్వారా ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఎక్కువ సంపాదన ఆశ చూపించి వలలో పడేస్తున్నారు. ఇక్కడి ఏజెంటు ద్వారా ఆ దేశంలో అడుగు పెట్టగానే వారి కార్యాలయాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఎవరి ఇంట్లో పనికి కుదిరితే వాళ్లు వచ్చి తీసుకెళతారు. పని బాగుంటే పర్లేదు కానీ ఇబ్బందులు ఎదురైతే మాత్రం యజమాని తిరిగి తీసుకెళ్లిన కార్యాలయానికే అప్పగించేస్తారు. ఎవరు వచ్చి పనికి తీసుకెళతారో తెలియక ఎవరైనా వచ్చేవరకూ కార్యాలయాల వద్దే బొమ్మల్లా ఎదురు చూడాల్సిన పరిస్థితి.

నకిలీ ఏజెంట్లపై నిఘా పెట్టాం 
జిల్లాలో నకిలీ ఏజెంట్లపై నిఘా పెట్టాం. గల్ఫ్‌ ఏజెంట్స్‌ పేరుతో జరుగుతున్న మోసాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాం. దీనిపై ఒక బృందాన్ని ఢిల్లీకీ పంపాం. నకిలీ ఏజెంట్లపై చీటింగ్‌ కేసులకు మాత్రమే పరిమితం చేయకుండా ట్రాఫికింగ్‌ కేసులూ పెడుతున్నాం.
 – ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement